Congress Senior Leader D Srinivas : కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, రాజ్యసభ (Rajya Sabha) మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డీఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబర్ 27, 1948లో జన్మించారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు డీఎస్. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన డీఎస్. 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి 3 సార్లు గెలిచారు. ఏడు సార్లు నిజామాబాద్ అర్బన్, ఓసారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు డీఎస్. 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్‌లో నెంబర్2గా ఉన్నారు డీఎస్. 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మపురి శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నిజామాబాద్ ఎంపీగా చిన్న కుమారుడు అర్వింద్ ఉన్నారు.
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డీఎస్.. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. హస్తం పార్టీ నుంచి టీఆర్‌ఎస్ (TRS) లోకి మారారు. టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు డీఎస్. చిన్నకుమారుడు బీజేపీలో చేరడంతో బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు డీఎస్. కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేగా ఓడిపోయారు.
2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023లో డీఎస్ కాంగ్రెస్ చేరిక కార్యక్రమం వివాదస్పదంగా మారింది. డీఎస్‌కు కాంగ్రెస్ ఇంచార్జి థాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.