Sebastian Pinera : చిలీ(Chilie) లో దారుణం జరిగింది. మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా(Sebastian Pinera)(74) మంగళవారం మధ్యాహ్నం దేశంలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Crash) లో మరణించినట్లు అతని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అత్యవసర ఏజెన్సీ సెనాప్రెడ్ ప్రకారం.. కూలిపోయిన హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులుండగా వీరిలో ముగ్గురు గాయాలతో బయటపడ్డారని ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రభుత్వం రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.
సరస్సులో కూలి..
ఈ మేరకు పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం(Accident) లో పినేరా ఒక్కరే మృతిచెందగా ప్రమాద సమయంలో హెలికాప్టర్‌ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది.
ప్రజా సేవకు తన జీవితం అంకితం..
అలాగే చిలీ మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. రెస్క్యూ సేవలు పినెరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని, ప్రభుత్వం జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తుందని చెప్పారు. 'మాజీ అధ్యక్షుడు పినెరా మమ్మల్ని పరిపాలించారు. ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం' అంటూ సంతాపం తెలిపారు.
ఇది కూడా చదవండి : విజయ్ బాటలో విశాల్.. పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం
దేశాధినేతల సంతాపం..
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా.. మొదటిసారి 2010 నుంచి 2014, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా(South America) దేశాధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు కావడం విశేషం.