India Vs China: చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. డ్రాగన్‌ తోక వంకరే!

ఓవైపు ఇండియా-చైనా మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు డ్రాగన్‌ మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. సరిహద్దుల్లో నిర్మాణాలు చేపడుతోంది. సరిహద్దులో వేగంగా రోడ్లు,శాశ్వత సైనిక గూడారాల నిర్మాణం చేపడుతున్నట్టు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఫొటోలల్లో భారీ యంత్రాలు, ట్రక్కులు కనిపిస్తున్నాయి.

New Update
India Vs China: చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. డ్రాగన్‌ తోక వంకరే!

Satellite images prove China doublespeak on border disengagement: చైనాను నమ్మడం.. పామును నమ్మడం రెండు ఒక్కటే.. ఈ విషయం ఇప్పటికీ లెక్కలేనని సార్లు ప్రూవ్‌ అయ్యింది. ఓవైపు చర్చలంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. సరిహద్దులో చైనా ఆగడాలు 'హద్దు' దాటుతున్నాయి. బ్రిక్స్ సమావేశం సందర్భంగా జిన్‌పింగ్‌, మోదీ సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ.. మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోంది డ్రాగన్‌.. వాస్తవాదీన రేఖ వెంబడి వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. ఆగస్టు 18నాటి ఉపగ్రహ చిత్రాలతో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బయట పడ్డ బండారం:
సరిహద్దులో వేగంగా రోడ్లు,శాశ్వత సైనిక గూడారాల నిర్మాణం చేపడుతున్నట్టు తేలింది. రోడ్లు, నిల్వ సౌకర్యాలు, నివాస యూనిట్లు , పరిపాలనా భవనాలు లాంటి అనేక నిర్మాణాలు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా 250 హెక్టార్ల విస్తీర్ణంలో మౌలికసదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఫొటోలల్లో భారీ యంత్రాలు, ట్రక్కులు కనిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖకు 65 కిలోమీటర్ల దూరంలోనే నిర్మాణాలు జరుగుతుండడం చైనా కవ్వింపు చర్యలకు నిదర్శనం. సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేస్తోంది జిన్‌పింగ్‌ సైన్యం. ఈ ఏడాది మంచు కరిగిన తర్వాత నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. రెండు దేశాలకు వ్యూహాత్మకంగా ఇది కీలకమైన ప్రాంతం. భవిష్యత్తులో ఉద్రిక్తతలు పెరిగితే చైనాకు అడ్వాంటేజ్‌ ఉంటుంది.

కొనసాగుతోన్న ప్రతిష్టంభన:
2020 మే నుంచి చైనా, భారత్‌ల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. మే 5, 2020న పాంగోంగ్ లేక్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. జూన్ 2020లో గాల్వన్ వ్యాలీలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల కారణంగా, పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున.. గోగ్రా ప్రాంతంలో 2021లో రెండు పక్షాలు దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశాయి. అయితే ఆ తర్వాత నుంచి కార్యకలాపాలను ముమ్మరం చేసింది డ్రాగన్. ఇక ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు సరిహద్దుల్లో నిర్మాణాలు చేపడుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వివాదాస్పద ఏరియా నుంచి సైన్యం వెనుదిరగాలన్నది ఒప్పందంలో భాగం. ఐనప్పటికీ ఈ వివాదాస్పద ప్రాంతంలోనే చైనా సైన్యం కదలికలు కొనసాగుతున్నాయి. స్టాండ్‌ఆఫ్ లొకేషన్‌ల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, PLA(China army) ఆ పని చేయడం లేదు. సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. ప్రతిష్టంభన ప్రారంభమయ్యే ముందు ఉన్న దానికంటే ఎక్కువగా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు