జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ను సంబరాల రాంబాబు అని ఏ ముహుర్తాన అన్నాడో కానీ ఆయన అన్నట్టే అదే ట్యూన్ తో రూపొందించిన పాట ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సత్తెనపల్లిలో ఆయన చేసిన డెవలప్ మెంట్ ను ప్రశంసిస్తూ రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి :BREAKING: ప్రాణం తీసిన పతంగి సరదా
మరోవైపు అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో (Sankranti festival) అసలు సిసలు సంబరాల రాంబాబుగా మారిపోయారు. పల్నాడు జిల్లా (palnadu district) సత్తెనపల్లి (sattenapalli) లో స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా మహిళలతో పాటు స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఆయన భోగి మంటల చూట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. అక్కడున్న వాళ్లను హుషారెత్తించారు. స్టెప్పులతో హోరెత్తించారు. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో పాల్గొన్న యువత కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ పండుగను ఆస్వాదించారు. ఆయన చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత ఏడాది కూడా అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో డాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లు అంబటి అభిమానులు ఆయన మీదా ఒక ప్రత్యేక పాటను విడుదలచేశారు. ఇప్పుడు ఆ పాట ట్రెండింగ్ లో ఉంది. ఆ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అవునవును మీరన్నది నిజమేను అంబటి రాంబాబు సంబరాల రాంబాబే. ప్రగతిని పంచే శ్రామికుడు, ప్రజలను కాచే సైనికుడు, సత్తెనపల్లికి సేవకుడు, సత్తువ ఉన్న రాంబాబు, ఆపదవస్తే అండగా నిలిచే మొనగాడు అందుకే మా బాబు అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు అంబటి రాంబాబు అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.
అంబటి రాంబాబు భోగి మంటల చుట్టూ వేసిన స్టెప్పులు.. డాన్స్ కు తగ్గట్టు ఈ పాటను రూపొందించడంతో ఆయన డాన్స్ తో పాటు పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డాన్స్ పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆయనను సంబరాల రాంబాబు అంటూ కామెంట్ చేస్తుండగా, పలువురు నెటిజన్లు మాత్రం అంబటి డాన్స్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..అంబటి రాంబాబు రాజకీయాలకు అతీతంగా స్థానికులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొనడంతో అక్కడి వారంతా ఆనందంతో చప్పట్లు చరుస్తూ ప్రోత్సాహించారు.