Sai Sudharshan: టీమిండియా యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు. జోహెన్నెస్ బర్గ్‌లో జోరుగా బ్యాటింగ్ చేసిన సాయి సఫారీ జట్టుతో వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ ప్రదర్శనతో అరుదైన రికార్డు తన సొంతమైంది.
చేజింగ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఈ యువ ఓపెనర్ మొత్తం 43 బంతులాడి 9 బౌండరీల సాయంతో అజేయంగా 55 పరుగులు సాధించాడు. అంతేకాదు, ఛేదనలో శ్రేయస్ అయ్యర్ (52)తో కలిసి రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియా ఈజీగా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేయడం ద్వారా సాయి సుదర్శన్ వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున తొలి వన్డే ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించినవారిలో సాయి సుదర్శన్ 17వ బ్యాటర్. అయితే, ఓపెనర్‌గా వచ్చి తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసినవారిలో మాత్రం సాయి నాలుగో ప్లేయర్.
గతంలో రాబిన్ ఊతప్ప, కెఎల్ రాహుల్, ఫియాజ్ ఫజల్‌లు ఓపెనర్లుగా వచ్చి తాము ఆడిన తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీలు సాధించారు. ఇప్పుడు ఆ లిస్టులో సాయి పేరు కూడా చేరింది. ఊతప్ప 2006లో ఇంగ్లండ్‌పై తన తొలి మ్యాచ్‌లో 86 పరుగులు చేశాడు. రాహుల్ 2016లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీళ్లతో పాటు ఫియాజ్ ఫజల్ కూడా కూడా జింబాబ్వేతో ఆడిన తన తొలి మ్యాచ్‌లో (2016) 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇది కూడా చదవండి: మరోసారి టీమిండియా టాప్.. టెస్ట్ చాంపియన్ షిప్ లో నెక్స్ట్ ఎవరో తెలుసా!
గతేడాది నుంచి ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ ఆకట్టుకున్నాడు సాయి సుదర్శన్. 2022 సీజన్‌లో ఆ టీం తరఫున ఆడింది ఐదు మ్యాచ్‌లే అయినా 145 రన్స్ చేశాడు. ఈసారి ఏకంగా 13 మ్యాచ్‌లు ఆడి 46.09 యావరేజ్‌తో 507 పరుగులు రాబట్టి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ తో పాటు ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ మ్యాచ్‌లలో కూడా సాయి నిలకడగా ఆడుతున్నాడు.