రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రష్యాకు చెందిన ఓ యుద్ధవిమానం ఉక్రెయిన్ ఖైదీలను తీసుకెళ్తోంది. ఈ క్రమంలోని ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ యుద్ధ విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలున్నారని.. వారితో పాటు ఆరుగురు విమాన సిబ్బంది.. మరో ముగ్గురు ఇతరులు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ప్రస్తుతం ఆ యుద్ధ విమానం గాల్లో నుంచి కిందపడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుద్ధ ఖైదీలను మార్చుకునే ఒప్పందంలో భాగంగా రష్యా తమ యుద్ధ విమానంలో 65 మంది ఖైదీలను తీసుకెళ్లింది. కానీ రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గోర్డ్ అనే ప్రాంతంలో ఇలా ఊహించని ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.