Yuvraj Singh About Rohit Sharma: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి రోహిత్ శర్మపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న యువీ ప్రస్తుతం టోర్నమెంట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక ఐసీసీ ఈవెంట్‌లో యువరాజ్ మాట్లాడుతూ.. భారత్ వరల్డ్‌కప్ నెగ్గాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ కీలకం అని అన్నాడు. రోహిత్ తప్పనిసరిగా టీమిండియాకు టైటిల్ అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టు కూడా బాగుందని, సారధిగా హిట్‌మ్యాన్ ముందుండి టీమ్‌ను నడిపిస్తాడని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో తనకున్న అతి కొద్దిమంది స్నేహితుల్లో రోహిత్ ఒకడని తెలిపాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు యువీ.
Also Read: కలిసికట్టుగా.. ఒకే జట్టుగా 96 మంది కుటుంబసభ్యులు ఓటేశారు
యువరాజ్ ఇంకా మాట్లాడుతూ.. "ఒత్తిడి అధికంగా ఉండే పొట్టి వరల్డ్‌కప్‌లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే కెప్టెన్ అవసరం. మనకు సరిగ్గా అలాంటి కెప్టెనే ఉన్నాడు. ఎంత సక్సెస్ అయినా ఇప్పటికీ రోహిత్‌లో మార్పు లేదు. మైదానంలో ముందుండి నడిపిస్తాడు. బయట అందిరితో సరదాగా ఉంటాడు. క్రికెట్‌లో తను నాకు ఆప్తమిత్రుడు. గతేడాది స్వదేశంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ లో ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లాడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు. నాకు తెలిసి టీమిండియాకు రోహిత్ లాంటి మంచి కెప్టెన్ కావాలి" అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.