విశాఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లో నుంచి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు విజయ్ కుమార్ భార్య విజయలక్ష్మీ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆయన భార్య డాబా గార్డెన్స్ లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఉద్యోగాల నేపథ్యంలో వేరే దగ్గర ఉంటున్నారు.
గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన విజయ్ కుమార్ భోజనం అనంతరం విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ తో కలిసి ఎస్ కోటకు వెళ్లారు. రాత్రి 7. 30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వంటగదిలో ఉన్న తైనాల భార్య కళ్లలోకి పెప్పర్ స్ప్రే కొట్టి మెడ పై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించి మెడలోని పుస్తెల తాడు తో పాటు మరో బంగారు నగను కూడా ఎత్తుకెళ్లారు.
ఆ తరువాత ఆమెతోనే బీరువా తీయించి అందులో ఉన్న రూ.8 లక్షల నగదును తీసుకున్నారు. తర్వాత ఆమెను బాత్రూంలోకి తోసి పరారయ్యారు. ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేయగా ఆయన ఫోన్ తీయలేదు. దీంతో కారు డ్రైవర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా విషయం తెలుసుకున్న వెంటనే ఇంటికి వచ్చి చూశారు.
ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే పెంపుడు కుక్క వారం క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో ఇంట్లో ఆయన భార్య ఒక్కరే ఉండడంతో దుండగులు చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also read: ఎవరీ కపిల్ రాజ్.. ఇప్పుడు కేజ్రీవాల్..అప్పుడు హేమంత్ సోరెన్!