/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Richest-temples-in-india-1.jpg)
Richest Temples in India: నిధులు.. పాములు.. అపార సంపద..! ఇండియాలో కొన్ని రోజులగా మారుమోగుతున్న పదాలు ఇవి. 46ఏళ్ల తర్వాత పూరీ రత్న భాండాగారం (Puri Ratna Bhandar) తెరుచుకోవడంతో యావత్ దేశం చూపు జగన్నాథుడి ఆలయంపైనే పడింది. కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో (Anantha Padmanabha Swamy Temple) ఉన్నట్టే జగన్నాథ ఆలయంలోనూ అపార సంపద ఉందని చాలా మంది నమ్ముతుంటారు. ఆ గుడిలోని రత్న భాండాగారంలో అంతుచిక్కని నిధినిక్షేపాలు ఉన్నట్లు చెబుతుంటారు. ఇక అందమైన, అద్భుతమైన దేవాలయాలకు నిలయంగా ఉన్న భారత్‌లో అపారమైన సంపద నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలే దేశంలోని కొన్ని దేవాలయాలను ధనిక ఆలయాలగా మార్చాయి. ఈ అత్యంత ధనిక ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
తిరువనంతపురం నడిబొడ్డున శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఇందులో మహా విష్ణువు కొలువై ఉంటారు. ఇక్కడ విష్ణువు శేషనాగపై నిద్రిస్తున్న భంగిమలో ఉంటారు. ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. మహాభారతం ప్రకారం, శ్రీ కృష్ణుడి అన్నయ్య బలరాం ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ పూజలు చేశాడని చెబుతారు. ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం కలియుగ మొదటి రోజున స్థాపించారని నమ్ముతారు. అయితే 1733లో ఈ ఆలయాన్ని ట్రావెన్‌కోర్ రాజు మార్తాండ వర్మ పునర్ నిర్మించారు. ఇక 2011 జులైలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆలయ ఖజానాలో గుప్త నిధి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నిధి విలువ లక్ష కోట్లు ఉంటుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుమల దేవస్థానం హిందూవులు అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో వేంకటేశ్వరుడు విగ్రహ రూపాన్ని తీసుకున్నాడని భక్తులు నమ్ముతారు. ప్రతిరోజూ దాదాపు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తిరుమల ఆలయానికి 1,161 కోట్ల నగదు సమకూరినట్లు టీటీడీ చెబుతోంది. ఈ ఆదాయంతో శ్రీవారితో పాటు టీటీడీ పేరిట వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు 18,817 వేల కోట్లకు చేరుకుంది.
11వ శతాబ్దంలో పూరీ జగన్నాథ దేవాలయాన్ని కట్టారు. ఈ ఆలయ నికర విలువ రూ. 150 కోట్లుగా అంచనా వేస్తారు. దాదాపు 30,000 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఈ ఆలయంలోనే అపార నిధి ఉందని భక్తులు నమ్ముతున్నారు. 1978 లెక్కల ప్రకారం రత్న భాండాగారంలో 12వేల 831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు గత ప్రభుత్వం చెప్పింది. ఒక భారీ అంటే 11.66 గ్రాములు. ఇక ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్‌మెంట్‌లో ఉండే ఈ రహస్య గదిలోనే భక్తులు సమర్పించే ఆభరణాలు, విరాళాలను భద్రపరుస్తారు.
మదురైలోని మీనాక్షి దేవాలయానికి ప్రతిరోజూ 20,000 నుంచి 30,000 మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. 33,000 శిల్పాలను కలిగి ఉన్న ఈ ఆలయం 1623-1655 మధ్య కాలంలో నిర్మించారని చరిత్రచెబుతోంది. ఇక్కడి వాస్తుశిల్పం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఏటా సుమారు 6 కోట్ల రూపాయలను ఆర్జిస్తుంది.
గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. దాని అపారమైన సంపద కోసం 1026లో మహమ్మద్ గజనీ ఈ ఆలయంపై ఏకంగా 17 సార్లు దాడి చేశాడు. ఎంతోమంది విదేశీ రాజులు ఈ ఆలయంపై దాడులు చేసినా ఈ టెంపుల్ ఇప్పటికీ విలువైన ఆస్తులను కలిగి ఉంది. దేశంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఆలయం మొత్తం ఆస్తుల విలువ దాదాపు 9 వేల కోట్ల రూపాయలు.