TS 2nd CM Revanth Reddy: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన ఫుల్ ప్రొఫైల్ ఇదే!

New Update
TS 2nd CM Revanth Reddy: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన ఫుల్ ప్రొఫైల్ ఇదే!

Revanth Reddy Full Profile: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా రేవంత్ రెడ్డి పేరే.. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి చిత్రాలే. అవును.. రాష్ట్రంలో ఇప్పుడంతా రేవంత్ మేనియా నడుస్తోంది. కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు మొదలు.. సాధారణ ప్రజల వరకు అందరి నోటా రేవంత్ పేరుతో నినాదాలు మారుమోగిపోతున్నాయి. ఎందుకంటే.. ఆయన రాజకీయ ప్రస్థానం అలాంటిది మరి. ఇది కదా సక్సెస్ జర్నీ అంటే.. అని ప్రతి ఒక్కరూ అనుకునేలా, ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచేలా రేవంత్ పొలిటికల్ ప్రస్తానం సక్సెస్‌ఫుల్‌గా సాగింది మరి. ఆయన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఆయన పూర్తి ప్రొఫైల్ ఏంటోసారి చూద్దాం..

రేవంత్ రెడ్డి ప్రస్థానం..

1969 నవంబరు 8తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి జన్మించారు. ఏవీ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టా పొందాడు. ఆ తరువాత కేంద్ర మాజీ మంత్రి, దివంగత నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె నైమిష రెడ్డి ఉన్నారు.

రాజకీయ జీవితం..

విద్యార్థి దశ నుంచి రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆసక్తిని కనబరిచేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో రేవంత్ ఏబీవీపీలో సభ్యుడిగా ఉన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తరువాత.. ఆ పార్టీలో చేరారు. అయితే, 2004 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు రేవంత్ రెడ్డి. కానీ, నాడు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుల్లో భాగంగా అది సాధ్యపడలేదు. ఆ తరువాత మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ టికెట్ ఆశించారు. అప్పుడు కూడా రేవంత్‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ పార్టీకి దూరయ్యారు. 2006లో మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

ఆ తరువాత మరుసటి సంవత్సరం అంటే.. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా రేవంత్ రెడ్డి స్థానిక సంస్థ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. దాంతో.. ఆయన పేరు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగిపోయింది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడి ఆహ్వానంతో.. రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు.

శాసన సభ సభ్యుడిగా..

2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గురునాథ్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. 2009 - 2014 మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, 2014 - 2018 మధ్య తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి గుర్నాథ్ రెడ్డిపై గెలుపొందిన రేవంత్ రెడ్డి.. తెలంగాణా శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికయ్యారు.

2017 అక్టోబరు 31న, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇదే రేవంత్ తొలి ఓటమిగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత 20 సెప్టెంబర్ 2018న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఆయన నియమితులయ్యారు.

పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక..

2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓటమి తరువాత.. రేవంత్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి తన సమీప ప్రత్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

టీపీసీసీ చీఫ్..

జూన్ 2021లో.. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. 7 జూలై 2021న టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించారు.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీకి ధీటుగా ప్రచారంతో హోరెత్తించారు. తన పదునైన మాటల తూటాలు, ఆకర్షించే ప్రసంగంతో.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని చేరువ చేశారు. చివరకు ఈ ఎన్నికల్లో ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణలో ప్రభత్వం ఏర్పాటుకు సమాయత్తం అవుతోంది. కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో ఓటమిపాలైనా.. కొడంగల్‌లో గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. గురువారం నాడు అంటే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రేవంత్ రెడ్డి ప్రొఫైల్ సంక్షిప్తంగా..

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబరు 8న జన్మించారు రేవంత్ రెడ్డి.
2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం
2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్రంగా ఎన్నిక
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు
2014 లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
2014 - 17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్
2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా
2017 లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి
2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం
2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్
2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
2023 డిసెంబర్‌లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
2023, డిసెంబర్ 7న తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

Also Read:

Telangana Elections: ‘ఈ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది’.. కేటీఆర్ ట్వీట్..

ISRO: ‘ఆదిత్య ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్‌ మీడియాలో ఇస్రో ఫోటో..

Advertisment
తాజా కథనాలు