TG News: చట్ట ప్రకారం 23%, పార్టీ తరఫున 19%.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై రేవంత్ వ్యూహం ఇదే!

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. చట్ట ప్రకారం ఉన్న 23 శాతంతో పాటు.. కాంగ్రెస్‌ పార్టీ పరంగా మరో 19 శాతం.. మొత్తంగా బీసీలకు 42 శాతం కేటాయించాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

TG Local Body Elections: తెలంగాణలో పంచాయతీ సహా స్థానిక ఎన్నికల సమరం మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే దీనిపై రేవంత్ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టగా.. గ్రామాల్లోనూ ఎన్నికల హాడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల అంశం తెరమీదకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుల గణన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పలుసార్లు ప్రకటించారు. దీంతో ఎన్నికలు దగ్గర పడటంతో రిజర్వేషన్‌ అమలుపై చర్చ విస్తృతంగా సాగుతోంది. బీసీ జనాభా ప్రతిపాదికన తమకు సీట్లు కేటాయించాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు చట్టపరంగా ఉన్న 23 శాతంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపరంగా 19 శాతం సీట్లు కేటాయించి మొత్త 42 శాతం బీసీలకు ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.

సుప్రీం కోర్టు నిబంధనను అతిక్రమించకుండా..
ఈ మేరకు గత ఎన్నికల్లో లాగే చట్టపరంగా 23 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ మరో 19 పార్టీ పరంగా ఇవ్వడంతో 42 శాతం రిజర్వేషన్‌ పూర్తవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ మించకూడదనే సుప్రీం కోర్టు నిబంధనను అతిక్రమించకుండా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లోనూ దీనిని హైలెట్ చేసి చూపిస్తూ పైచేయి సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల హామీ ప్రకారం.. బీసీ కుల గణన చేసి, రిజర్వేషన్లను అమలు చేయాలంటే చాలా రిస్క్ తో కూడిన పని అన్న చర్చ సాగుతోంది. రెండు నెలల్లో బీసీ ఓటర్ల గణన పూర్తి చేయొచ్చు. కానీ కులాల వారీగా గణన చేయాలంటే 6నెలలకు పైగా సమయం పడుతుంది. ఎన్నికలు ఆలస్యమైతే గ్రామాల్లో సమస్యలు పేరిగిపోతాయి. దీంతో ఎలాగైనా 2024లోనే స్థానిక ఎన్నికలు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెల్లదు..
ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించితే అవి నిలవవు. గతంతోనూ బీహార్‌ ప్రభుత్వం బీసీలకు 54 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించింది. కానీ పాట్నా హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించింది. దీని ఆధారంగా తెలంగాణలోనూ 50 శాతానికి మించకుండా రాజ్యాంగ పరిమితి లోబడి ఎన్నికలు జరిపించాలని కాగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ బీసీలకు 50 శాతం కేటాయించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకోవాలి. దాని ఆధారంగా సర్వే చేసి ఓటర్ల వివరాలను బీసీ కమిషన్‌కు అందిస్తే.. అప్పుడు బీసీలకు ఇవ్వాల్సిన శాతంపై కమిషన్‌ స్పష్టతనిస్తుంది. మరోవైపు.. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చెల్లదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు