తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద పోటెత్తడం వల్ల అనేక ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 5 గేట్లు ఎత్తిన అధికారులు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 35,000 క్యూసెక్కుల నీరు మంజీరా నదికి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని వివిధ జలాశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్, కడెం ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు సైతం నిండుకుండలా మారాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడంతో ముందుస్తుగా అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుల గేట్లు వదిలి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు గెట్లు సైతం ఎత్తిన అధికారులు మూసికి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ వరదతో మూసి ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉండటంతో మూసీ నది పరివాహక ప్రాంత వాసులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు, వర్షాలు వచ్చే అవకాశం ఉందని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు,.