PV Narasimha Rao Birth Anniversary : దేశ రాజకీయాల్లో (Politics) తెలుగు వారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పీవీ నరసింహరావు (PV Narasimha Rao). దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన చాణక్యుడు. మన భారతదేశ ఠీవీ ఏది అంటే ఎంతో గర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటదారి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా పీవీనే.
పాములపర్తి వెంకట నరసింహారావు...ఈ పేరు అంటే అందరూ ఆయన ఎవరబ్బా అనుకుంటారేమో..కానీ పీవీ నరసింహరావు అంటే మాత్రం..వెంటనే ఆయన నిండైన తెలుగుదనం కళ్ల ముందు కదులుతుంది. పీవీ కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు...బహుభాషా కోవిదుడు. తెలంగాణ (Telangana) లో పుట్టిన ఈ అపర చాణక్యుడు దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకుని వచ్చి...ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.
ఉన్నత కుటుంబంలో పుట్టిన పీవీ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీవీ మొట్టమొదటి తన సంస్కరణలను తన ఇంటి వద్దనుంచే మొదలు పెట్టారు. తన కుటుంబ ఆస్తి అయిన 12 వందల ఎకరాల భూమిలో 1000 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టేశారు.
తెలంగాణలో రైతు కూలీల చేతికి ఎంతోకొంత భూమి దక్కిందంటే ఆయన వేసిన భూసంస్కరణల పాదే కారణం. ఆనాడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యాశాఖ మంత్రిగా కూడా పీవీ అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేశారు. జైళ్ల శాఖ మంత్రిగా ఓపెన్ జైల్ అనే వినూత్న పద్దతికి పీవీ శ్రీకారం చుట్టి పక్కాగా అమలు చేశారు.
పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశం అర్ధికంగా పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. 1962 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్దం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలై ఉంది. బంగారాన్ని ఇతర దేశ బ్యాంకుల్లో తాకట్టుపెట్టి పరువు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్లిష్ట సమయంలో దేశ పాలనా పగ్గాలు చేపట్టిన పీవీ.. రాజకీయాల్లోనే లేని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిని చేయడం అప్పట్లో సంచలన నిర్ణయం.
మన్మోహన్ సింగ్ ద్వారా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అర్థికరంగంలో వెలుగులు నింపారు. ఇవాళ ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వృద్ధి చెందడానికి నాడు మన పీవీ నాటిన ఆర్థికసంస్కరణ అనే మొక్కే కారణం. పీవీ నరసింహరావు ప్రధానమంత్రి కావడం అనేది కూడా అనుకోకుండా జరిగిపోయిందే.
అయితే ఇప్పటికీ కాంగ్రెస్ వాదులు అంటూ ఉంటారు. 1991 పార్లమెంటు ఎన్నికల్లో పీవీ నరసింహారావు పోటీ నుంచి పక్కకి తప్పుకున్నారు. పీవీ ఇక రాజకీయ సన్యాసమనే అంతా అనుకున్నారు. అయితే నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పీవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పీవీని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అలా తన ప్రయత్నం లేకుండానే పీవీ ప్రధాన మంత్రి అయిపోయారు.
సాధారణంగా అందరూ ఎన్నికల తర్వాత ప్రధాని మంత్రి అవుతారు. కానీ... పీవీ విషయంలో మాత్రం అది రివర్స్ లో జరిగింది. ముందుగా ప్రధాని అయిన తర్వాత ఆయన నంద్యాల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పీవీ గెలుపు ఓ రికార్డ్‌గా మిగిలిపోయింది. ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతవడమే కాదు..పీవీకి 90 శాతం ఓటింగ్ నమోదు కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది. పీవీ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే కాంగ్రెస్ ప్రయత్నం ఫలించకపోవడంతో ఎన్నికలబరిలో దిగాల్సి వచ్చింది. పీవీ ఎన్నికవ్వడంతో తెలుగు జాతి వైభవం, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం వంటి మాటలు దేశ రాజకీయాల్లో షికారు చేశాయి..
ఆనాటి ఆంధ్రప్రదేశ్ నివాసి, తెలుగువాడు, భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంటే ఆ విషయం ఓ పెద్ద సంచలనమే. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాడనే వార్తను దక్షిణభారత ప్రజలు ఎవరూ నమ్మలేకపోయారు. అంతకు ముందు 45 ఏళ్ల రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన ప్రజలు తెలుగువాడేమిటీ ప్రధానమంత్రి కావడమేంటనీ విస్తుపోయారు. భారత ప్రధానమంత్రి పదవి ఉత్తరభారతీయులకు మాత్రమే. అందులోనూ నెహ్రూ కుటుంబానికి మాత్రమే దాని మీద వారసత్వపు హక్కు ఉందని దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ముద్రపడిపోవడమే అందుకు కారణం.
రాజీవ్ గాంధీ మరణానంతరం ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీకే ఇవ్వాలనే వాదన పార్టీలోని ఓ వర్గం మొదలు పెట్టింది. నెహ్రూ కుటుంబానికి చెందిన వారయితేనే ఈ దేశాన్ని తీర్చిదిద్దగలుగుతారని, మరెవ్వరికీ అది సాధ్యం కాదని ప్రచారం మొదలు పెట్టారు. చివరికి పీవీ నరసింహారావు పేరు ప్రకటించడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయపడింది.
ఢిల్లీ పీఠంమీద దక్షిణాదివాడా? అందులోనూ తెలుగువాడా? అంటూ హేళన చేయడం మొదలు పెట్టారు. రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు తెలుగు ప్రజలతో పాటు, దేశప్రజలంతా కూడా టీవీలు, రేడియోలకు అతుక్కుపోయారు. అదో చారిత్రక ఘట్టం.
పీవీకి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పీవీ ఎంతోగానో కృషి చేశారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, తెలుగు మీడియం ద్వారా ఉన్నత విద్య వంటి కార్యక్రమాలు విద్యాశాఖ మంత్రిగా పీవీ నరసింహారావు అమలు చేసినవే.