RBI Good News: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు కొత్త నిబంధనలు తీసుకోస్తోంది. పలు రుణాలకు సంబంధించి ఛార్జీల వంటి పూర్తి వివరాలు లోన్ స్టేట్ మెంట్లో పొందుపర్చాలని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. రుణాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలతోపాటు ఛార్జీలు ఎంత, వార్షిక ఖర్చు ఎంత దేనికి ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నాము వంటి వివరాలు లోన్ స్టేట్ మెంట్లో స్పష్టంగా ఉండేలా చూడాలని తెలిపింది. వాటితోపాటు లోన్ రికవరీ ఏజెంట్ల పాలసీ, సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఎవర్నీ సంప్రదించాలి. ఇతరులకు లోన్ విక్రయించే అవకాశాల గురించి సైతం స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది . బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఈ కొత్త నిబంధన అమలు చేసేందుకు బ్యాంకులు వీలైనంత త్వరగా కొత్త విధానాన్ని రూపొందించాలని ఓ ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 1, 2024 లేదా ఆ తర్వాత జారీ చేసే రిటైల్, msme లోన్లతో పాటు ప్రస్తుత లోన్లకు సైతం ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కచ్చితంగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చేయడం ద్వారా రుణాలు తీసుకునేవారికి లోన్ గురించి స్పష్టంగా అర్థమవుతుందని ఆర్బీఐ తెలిపింది. తమకు ఎంత లోన్ వచ్చిందనే వివరాలను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీని ద్వారా కస్టమర్లు రుణాలపై తెలివైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ప్రస్తుతం బ్యాంకుల లోన్ స్టేట్ మెంట్లో ఛార్జీలకు సంబంధించి వివరాలు పొందుపరుస్తున్నాయి. అయితే ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్గదర్శకాలతో యానువల్ పర్సెంటేజ్ రేట్ బహిర్గతం కానుంది. ఇది రుణ గ్రహీతకు రుణాలపై వార్షిక ఖర్చులను తెలియజేస్తుంది. ఇందులో వడ్డీ రేటుతో పాటు ఇతర రుసుములకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్, లీగల్ ఛార్జీలు వంటి థర్డ్ పార్టీ సేవల కోసం వసూలు చేసే ఫీజు కూడా ఏపీఆర్ లో ప్రత్యేక కాలమ్ లో పొందుపర్చాలని స్పష్టం చేసింది. ఏపీఆర్ ద్వారా బ్యాంకుల లోను రుసుములు ఎంత ఉన్నాయో వినియోగదారులు సులభంగా తెలుసుకునే వీలుంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల జాతర షురూ!