Financial Planning: రామాయణం.. తరాలు మారినా.. టెక్నాలజీ పెరిగినా.. కథలు చెప్పుకునే.. చదివే విధానం మారిపోయినా.. ఇప్పటికీ భారతీయులందరికీ నచ్చే కథనం. రాముడు భారతీయులందరూ మెచ్చే హీరో. రామ కథ వినని వారు.. తెలియని వారు ఈ తరంలో కూడా ఎవరూ లేరు. తరాంతరాలను రామ చరితం చెరిపేసింది. ధర్మం-అధర్మం.. న్యాయం-అన్యాయం.. హీరో-విలన్ ఇలా సినిమాలు ఎన్నో రకాల కథల్ని మనకు చూపిస్తూనే ఉంటాయి. కానీ, వాటిలో అంతర్లీనంగా రామాయణం ఉంటుంది. అందులో చెప్పిన చెడుపై మంచి గెలవడం ఉంటుంది. ఒక్కోసారి తాత్కాలికంగా చెడ్డ వ్యక్తులు గెలుపు సాధించవచ్చు కానీ.. మంచి వ్యక్తులు చివరికి విజయం మెట్లపై చేరడం పక్కా అనేది రామాయణం (Ramayanam) చెప్పే సూక్తి. అది ఇప్పటికీ మనకి స్ఫూర్తి.
పైన చెప్పినవన్నీ రామాయాణం గురించి ఒక కోణంలో చెప్పినవి. రామాయణంలోని ప్రతి ఘట్టంలోనూ ఆర్ధికపరమైన లెక్కలు (Financial Planning) కూడా ఉన్నాయి తెలుసా? ఫైనాన్షియల్ మేనేజిమెంట్ కి రామ కథలోని ప్రతి ఘట్టం.. ప్రతి ప్రధాన పాత్ర ఒక లెక్కను చెబుతాయి. ఏమిటి? రామాయాణం ఫైనాన్షియల్ పాఠాలు చెబుతుందా? చాలు చాల్లెండి అని అనకండి.. వివరంగా చెబుతాం. ఇది చూశాక.. మీరే అంటారు నిజమే సుమా అని.
రామాయణం అంతా అందరికీ తెలిసిందే కదా. రాముడు.. సీత కళ్యాణం.. రాముడికి పట్టాభిషేకం చేయాలని తండ్రి దశరధుడు అనుకోవడం.. కైకేయి తన కుమారుడు భరతుడే రాజు కావాలని దశరధుని వరాల పేరుతొ.. రాముని వనవాసానికి పంపించడం.. రాముడు, సీత, లక్ష్మణుడు అడవులకు వెళ్లడం. అక్కడ శూర్పణఖతో గొడవ. ఆమె తన అన్నకి సీతను గురించి చెప్పడం.. సీతను పొందాలని రావణుడు అనుకోవడం.. తరువాత సీతకు బంగారు లేడిని చూపించడం.. దానికోసం రాముడు పరుగుపెట్టడం.. రాముడు ఆపదలో ఉన్నాడనే మాయను సృష్టించి.. లక్ష్మణుడిని కూడా అడవిలోకి వెళ్లేలా చేయడం.. ఒంటరిగా ఉన్న సీతను రావణుడు ఎత్తుకెళ్లిపోవడం. అక్కడ నుంచి రాముడు - హనుమంతుడు కలవడం.. లంకకు వెళ్లేందుకు సముద్రంపై వంతెన నిర్మించడం… రవాణ సంహారం.. సీతారాముల పట్టాభిషేకం. ఇదీ కథ అంతే కదా.
కైకేయి చెప్పే ఆర్ధిక పాఠం..
నిజానికి కైకేయి చాలా మంచిది. ఆమె రాముడిని చాలా ఎక్కువ ప్రేమగా చూసుకునేది. కానీ, ఆమె చేసిన ఒక్క పని అందరి దృష్టిలో ఆమెను విలన్ చేసింది. ఆమె తన చెలికత్తె మంథర సలహా తీసుకోవడం. అవును.. కైకేయికి భరతుడిని రాజును చేయాలనే కోరిక పుట్టించింది.. దానికి రాముడు వనవాసం చేయాలని వరం కోరుకొమ్మని సలహా ఇచ్చింది మంథర. ఈ ఘట్టం సరైన ఆర్ధిక సలహాదారుని(Financial Adviser)ఎంచుకోకపోతే మన జీవితం ఎలా మారిపోతుందో చెబుతుంది. ఒక తప్పుడు సలహా మనల్ని, మన డబ్బును నిలువునా ముంచేస్తుందని చెబుతుంది.
అందువల్ల, జీవితంలో ఏదైనా సలహా కోసం, ఒక తెలివైన వ్యక్తిని మాత్రమే చూడాలి. ఆర్థిక పరిజ్ఞానం విషయానికి వస్తే, సబ్జెక్ట్‌లో నిపుణుడైన వ్యక్తి మాత్రమే మీకు ఎల్లప్పుడూ సరైన సలహా ఇస్తారు. కాబట్టి, స్నేహితుడి లేదా బంధువు సలహా మేరకు ఎక్కడా డబ్బు పెట్టుబడి పెట్టకండి. నిపుణుల సలహా పొందండి.
Also Read: పద్ధతి ప్రకారం చేస్తే ఏ పనిలోనైనా లాభమే.. పెట్టుబడుల విషయంలోనూ అంతే!
బంగారు లేడి చెప్పే ఆర్ధిక నీతి:
సీతమ్మ బంగారు లేడిని చూస్తుంది.. దాని కోసం ఆశ పడుతుంది. ఆ ఒక్క కోరిక సీత-రాముల ఇద్దరి జీవితాల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. మనకు వచ్చే బంగారం ఆఫర్లు ఇలాంటివే. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బంగారం లాంటి ఆఫర్ల వల విసురుతారు కేటుగాళ్లు. బంగారు లేడి వెనుక రావణాసురుడి లాంటి రాక్షసుడు ఉన్నట్టే.. ఆఫర్ల వల వెనుక కూడా నేరగాళ్ల ఉచ్చు ఉంటుంది.
బంగారు జింకలా మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించే అన్ని రకాల ఆఫర్‌ల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ బంగారు జింక వెనుక కూర్చున్న రావణుడి లాంటి మోసగాడు ఉండొచ్చు. ఈ ఆఫర్లు, లాటరీలు వాడు వేసిన ఉచ్చు. దాని వలలో పడకూడదు.
హనుమంతుడు ఇచ్చే సంజీవని ఇదే:
లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోతాడు. అప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకు వస్తాడు. సంజీవని తో లక్షణుడు తిరిగి పూర్తి ఆరోగ్యవంతుడు అయి యుద్ధంలో రాముడికి సహాయంగా నిలుస్తాడు.
లక్ష్మణుడిలా సడన్ గా ఏదైనా జరిగి మీరు అపస్మారకంగా మారితే.. అనారోగ్య భూతం కోరల్లో చిక్కితే.. మీకు సంజీవని ఎవరు తెస్తారు. నీకు సంజీవని కావాలని హనుమంతుని వద్దకు ఎవరు వెళ్తారు? కుటుంబం ప్రేమ - మద్దతుతో పాటు, ఆపద సమయంలో మనకు సహాయపడే హనుమంతుడు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు. ఆ ఎమర్జెన్సీకి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం మంచిది.
లక్ష్మణ రేఖ.. మనకీ కావాలి..
సీతమ్మ వారు రావణుడు విసిరినా మాయలో చిక్కుకుని రాముడు ఆపదలో ఉన్నాడనీ.. రక్షించాలనీ లక్ష్మణుడిని ఆదేశిస్తుంది. రాముడికి ఏమీ కాదని ఎంత చెప్పినా ఆమె వినదు. దీంతో తప్పనిసరై ఒంటరిగా సీతను వదిలి అడవిలోకి బయలుదేరుతాడు లక్ష్మణుడు. వెళ్లేముందు సీతమ్మకు రక్షగా ఒక రేఖ గీస్తాడు. దానిని ఎటువంటి పరిస్థితిలోనూ దాటవద్దని చెబుతాడు. కానీ, మళ్ళీ రావణుడి మాయలో పడి ఆ గీత దాటుతుంది సీతమ్మ. రావణుడికి దొరికిపోతుంది.
సీత భద్రత కోసం లక్ష్మణుడు గీత వేసినట్లే మనం కూడా మన బడ్జెట్ చుట్టూ ఎప్పుడూ లక్ష్మణ రేఖను గీయాలి. సున్నా వడ్డీకి రుణం లభించినప్పటికీ, ఒకరి బడ్జెట్‌కు మించి పెద్దగా కొనుగోలు చేయడం లేదా రుణం తీసుకోవడం వంటి ఏదైనా నిర్ణయం తీసుకోకూడదు. ఈ ఆకర్షణీయమైన ఒప్పందాలు మొదట సాధువులా వస్తాయి. తరువాత అప్పుల రావణుడిగా మారిపోతాయి. అందుకే మన బడ్జెట్ లక్ష్మణ రేఖ ఎట్టి పరిస్థితిలోనూ దాటకూడదు.
రామ సేతు.. మన SIP:
చిన్న చిన్న రాళ్లు వేసి పెద్ద సముద్రాన్ని దాటే వంతెన వానరులు ఎలా నిర్మించారో.. అదే విధంగా చిన్న చిన్నగా SIP ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్ పెద్ద నిధిగా మరి మన ఆర్థిక లక్ష్యాలకు వంతెనగా నిలుస్తుంది. కోట్లు కూడా ఒక్క రూపాయి వద్దే ప్రారంభం అవుతాయి కదా. అందుకే చిన్న మొత్తాలను పొదుపు చేస్తే కొండంత అండగా మారే నిధిగా మారుతుంది.
ఎమర్జెన్సీ కి సిద్ధంగా ఉండడం..
రాముడు యువరాజు.. దేనికీ లోటు లేనివాడు. కానీ అకస్మాత్తుగా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అడవుల బారిన పడ్డాడు. అది ఆయన తప్పు కాకపోవచ్చు. కానీ పరిస్థితులు ఎంతటి వారినైనా ఒక్కోసారి బికారిని చేస్తాయి అని అర్ధం అవుతుంది కదా. మనకీ అలాంటి పరిస్థితి ఎదురై ఉద్యోగం పోయి లేదా వ్యాపారం పాడైతే.. నిలదొక్కుకునే అవకాశం ఎలా వస్తుంది? అందుకే ఎమర్జెన్సీ ఫండ్ (Emergency Fund) ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. ఆర్థికంగా, మనం ఎల్లప్పుడూ అత్యవసర నిధిని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
క్రెడిబిలిటీ.. ఇంకా చెప్పాలంటే ప్రతిష్ట చాలా అవసరం:
రాముడు ఏమీ లేకుండా అడవుల బారిన పడినా.. ఆయన ఎక్కడికి వెళ్లినా గొప్ప ఆతిథ్యం దొరికింది. ఎందుకంటే, రాముడికి ఉన్న మంచి పేరు. ప్రతిష్ట. అందుకే ప్రజలు ఆయనను ప్రేమించారు. ఇప్పుడు ఆర్ధిక అంశాలలో మన ప్రతిష్ట క్రెడిట్ స్కోర్ (Credit Score). దీనిని నిలబెట్టుకోవడం అంటే మన గౌరవం నిలబెట్టుకోవడం. మనకు ఏదైనా ఆర్థిక సంక్షోభం ఎదురైతే అటువంటప్పుడు మన క్రెడిట్ స్కోర్ బాగుంటే, సహాయం చేయడానికి ఏదైనా బ్యాంకు సిద్ధంగా ఉంటుందని అర్థం. అదే సమయంలో, క్రెడిట్ స్కోర్ బాగోకపోతే రూ. 5,000 కూడా లోన్ పొందడం కష్టం.
ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఆర్థికంగా కష్టాల పాలవుతాం కదా.. అని మీరనవచ్చు. అది కూడా నిజమే. దీనికి కూడా రామకథే ఒక చక్కని ఆయుధం అందించింది. అది ఓపిక. రాముడికి కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. పధ్నాలుగేళ్ల పాటు అడవిలో ఉండాల్సిన పరిస్థితి. అక్కడ సీతమ్మ కిడ్నాప్.. కాలినడకన సముద్రాలు దాటాల్సి పరిస్థితి. ఎప్పుడు రాముడు ఓపిక కోల్పోలేదు. అందుకే కాలినడకన సముద్రం దాటి.. లంకకు వెళ్లి రావణుడు అనే కష్టాన్ని గెలిచి… కుబేరుని పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చి రామచంద్రమూర్తిగా ప్రజలకు చక్రవర్తిగా పాలన సాగించాడు.
ఓపిక పడితే.. ఓరిమితో వ్యవహరిస్తే ఎంత కష్టం అయినా తీరిపోతుంది. కచ్చితంగా అనుకున్న ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవచ్చు. మనం డబ్బు సంపాదించడానికి ఓపిక పట్టాలి. ధనవంతులు కావడానికి షార్ట్‌కట్‌ల కోసం వెతకకూడదు. మొదట్లో విలాసాలు వదిలేసి పెట్టుబడిపై దృష్టి పెట్టాలి. మార్కెట్‌లో హెచ్చు తగ్గులు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలంలో, సహనం - అవగాహనతో మాత్రమే మనం అర్హులైన వాటిని సాధించగలుగుతాము.
Watch this interesting Video: