రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంలో కొత్త వస్తువులను మార్కెట్ లోకి తీసుకురావాలంటే దానికి తప్పకుండా రాముని పేరుండేలా జాగ్రత్త పడుతున్నారు. పుట్టే పిల్లలకు కూడా రాముని పేరు కలిసేలా చూస్తున్నారు. అలాంటిదే గుండెపోటు, ఛాతి నొప్పులకు ఇంట్లోనే చికిత్స చేసుకునేందుకుగాను రామ్ కిట్ అనే అత్యవసర ప్యాక్ అందుబాటులోకి వచ్చింది. కాన్పూర్‌లోని లక్ష్మీపత్ సింఘానియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ అనే సంస్థ హృద్రోగుల కోసం ఈ కిట్‌ను తయారు చేసింది.
రామ్ కిట్ గుండె రోగులకు అత్యవసరం కోసం తయారు చేయబడింది. ఈ కిట్‌పై రాముడి చిత్రంతో పాటు మేం చికిత్స చేస్తాం, అతను చికిత్స చేస్తాడు అని రాసి ఉంటుంది.ఇందులో అవసరమైన మందులు, ఆసుపత్రుల హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఉన్నాయి.
రామ మందిర ప్రతిష్టాపనతో పాటు అందరూ రామున్ని విశ్వసిస్తారు కాబట్టి రామ్ కిట్ కి రాముడి పేరు పెట్టారు.ఈ కిట్‌లో రక్తం సన్నబడటానికి, గుండె సిరల్లోని అడ్డంకులు తొలగించడానికి, హృద్రోగులకు ఉపశమనం కలిగించడానికి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. పేదలను దృష్టిలో ఉంచుకుని కేవలం 7 రూపాయలకే ఈ కిట్‌ను తయారు చేశారు. రామ్ కిట్‌లో మూడు ముఖ్యమైన ఔషధాలు ఉన్నాయి. ఎకోస్ప్రిన్ (రక్తం పలుచబడటం కోసం), రోసువాస్టాటిన్ (కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం కోసం), సోర్బిట్రేట్ (మెరుగైన గుండె పనితీరు కోసం).
ఇవి గుండె జబ్బుతో బాధపడుతున్న ఎవరికైనా త్వరిత ఉపశమనాన్ని అందిస్తాయి. గుండెపోటు వచ్చినప్పుడు రోగులకు ఇచ్చే ఈ మూడు మందులను ఈ కిట్‌లో చేర్చారు. ఎవరైనా గుండెపోటు లేదా ఛాతీ నొప్పి వస్తున్న సందర్భాల్లో ఇంట్లో ఈ ఔషధాన్ని తీసుకుంటే ఆ ప్రమాదాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు. అయితే ఇది పూర్తిగా నొప్పిని తగ్గిస్తుందని కాదు. ఆసుపత్రికి వెళ్లేలోగా కొంత ఉపశమనం కలిగిస్తుంది. అందుకే పూర్తిగా ఈ కిట్ మీదే ఆధారపడవద్దని, గుండె లేదా ఛాతీ నొప్పి వచ్చినపుడు కిట్ లో ఉండే మందులను తీసుకుని వీలయినంత త్వరగా దగ్గరిలోని ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేయాలని తయారీదార్లు చెబుతున్నారు.