Food To Eat in Rainy Season: మొన్నటి వరకు మండే ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వాతావరణం చల్లబడటం ఊరటనిస్తోంది. ఇదే సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో వ్యాధులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఇలాంటప్పుడు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో ఏం తినాలో , ఏం తినకూడదో ఒకసారి చూద్దాం..
వర్షాకాలంలో అన్నింటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని తగినంత నీరు త్రాగటం. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఈ సమయంలో కూడా శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండచ్చు. అల్లం (Ginger), హెర్బల్ టీలు, సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు అందులో పసుపు (Turmeric Powder) వేసి ఇస్తే, పసుపులో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
సీజనల్ ఫ్రూట్స్ (Seasonal Fruits) తప్పక తినాలి. యాపిల్స్, దానిమ్మ, నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి. బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్ కూడా మంచివే. ప్రతీ రోజూ బాదం తింటే చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి వెల్లుల్లి, ఉల్లిపాయలు రక్షిస్తాయి. ఇవి మానేద్దాం..
ఆకుకూరలు (Leafy Vegetables) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సీజన్‌లో ఆకుకూరలు పండించే ప్రదేశాలు అపరిశుభ్రంగా మారుతాయి కాబట్టి వీలైనంతవరకు తీసుకోకపోవటమే మంచిది. వర్షాకాలపు తేమ వాతావరణంలో పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. ఇక వర్షం పడిందంటే చాలు స్ట్రీట్ ఫుడ్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఎంత రుచి ఉంటాయో, అంతకన్నా ఎక్కువ రోగాలు వస్తాయి. ఈగలు, దోమలు, ఇతర బ్యాక్టీరియా ఆ పదార్దాలపై చేరుతాయి. అలాగే వర్షాకాలంలో నీరు కూడా కలుషితమవుతుంది. ఆ నీటినే ఫుడ్స్ తయారీలో వాడవచ్చు. వీటివల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు ఉంటాయి. వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.చేపలు, రొయ్యలు, పీతలు వంటి సీ ఫుడ్, రెడ్ మీట్ కలుషితం కావడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని కూడా కాస్త దూరం పెట్టండి.