Rain alert for Telangana And Andhra Pradesh Next Two days: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచనను జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాతుందని.. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని, ఐదు రోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగు నాట వాతావరణం పొడిగా మారుతుందని పేర్కొంది వాతావరణ శాఖ. మళ్లీ కొంత కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షపు చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు పడుతున్నాయి.
అల్పపీడన ప్రభావం ఏపీలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్సుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
అలాగే కోస్తా జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తున్నందువల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది.