Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ (Badminton) మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) అద్భుత విజయం సాధించింది . మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి తదుపరి స్థాయికి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. దీంతో ఆమె ఏకపక్షంగా 21-9 పాయింట్ల తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకుంది.
Sindhu In Olympics : రెండో సెట్ ప్రారంభంలో క్రిస్టీన్ కూబా వైపు నుంచి మంచి పోటీ కనిపించింది. కానీ అనుభవజ్ఞురాలైన పివి సింధు కాస్త తెలివిగా ఆడటంతో ఆరంభంలో ఆధిక్యం సాధించింది. ఫలితంగా, భారత స్టార్ 6 వరుస పాయింట్లు కొట్టి 15 పాయింట్లు సాధించింది. దీంతో లయ కోల్పోయిన ప్రత్యర్థి క్రిస్టీన్ కూబా వరుస తప్పిదాలు చేసింది. మరోవైపు భారత స్టార్ దూకుడుగా ఆడింది. దీంతో సింధు 21-10 పాయింట్ల తేడాతో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటివరకూ పీవీ సింధు అద్భుత ఫామ్ కనబరుస్తోంది. అన్ని మ్యాచ్ లలోనూ వరుస సెట్లలో విజయం సాధిస్తూ వస్తోంది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో కచ్చితంగా పీవీ సింధు మెడల్ సాధిస్తుందనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతోంది.
సింధుపై అంచనాలు:
ఈ ఒలింపిక్స్‌లో పీవీ సింధు నుంచి పతకం ఆశించవచ్చు. ఎందుకంటే గత రెండు ఒలింపిక్స్‌లో భారత కీర్తిని ఆమె చాటి చెప్పింది. 2016లో రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాబట్టి ఈసారి కూడా పీవీ సింధు నుంచి పతకం ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె ప్రదర్శన కూడా ఉంది.
పివి సింధు విజయాలు:
- 2013 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లు (World Badminton Championships) (గ్వాంగ్‌జౌ, చైనా) - కాంస్యం
- 2014 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (డెన్మార్క్) - కాంస్యం
- 2014 కామన్వెల్త్ గేమ్స్ (స్కాట్లాండ్) - కాంస్యం
- 2014 ఆసియా ఛాంపియన్‌షిప్స్ (దక్షిణ కొరియా) - కాంస్యం
- 2016 రియో ఒలింపిక్స్ 2016 (బ్రెజిల్)- రజతం
- 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (స్కాట్లాండ్) - రజతం
- 2018 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (చైనా) - రజతం
- 2018 కామన్వెల్త్ గేమ్స్ (ఆస్ట్రేలియా) - రజతం
- 2018 ఆసియా క్రీడలు (ఇండోనేషియా) - రజతం
- 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (స్విట్జర్లాండ్) - స్వర్ణం
- 2020 టోక్యో ఒలింపిక్స్ 2020 (జపాన్) - కాంస్యం
- 2022 ఆసియా ఛాంపియన్‌షిప్స్ (ఫిలిప్పీన్స్) - కాంస్యం
- 2022 కామన్వెల్త్ గేమ్స్ (ఇంగ్లండ్) - స్వర్ణం
Also Read : సిగరేట్ తాగకపోయినా…లంగ్ క్యాన్స్‌ర్!