Telangana: నన్ను క్షమించండి అమ్మా.. కన్నీరు పెట్టిస్తున్న ప్రవళిక కథ..

టీఎస్‌పీఎస్‌సీ.. ఈ పేరు వింటేనే నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. గ్రూప్ పరీక్షలు రద్దు కావడం, వాయిదాలు పడుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిని వదిలేసి పట్టణాలు, నగరాలకు వచ్చి చదువుకుంటున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అశోక్‌నగర్ హస్టల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక అనే ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Telangana: నన్ను క్షమించండి అమ్మా.. కన్నీరు పెట్టిస్తున్న ప్రవళిక కథ..
New Update

టీఎస్‌పీఎస్‌సీ.. ఈ పేరు వింటేనే నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. గ్రూప్ పరీక్షలు రద్దు కావడం, వాయిదాలు పడుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిని వదిలేసి పట్టణాలు, నగరాలకు వచ్చి చదువుకుంటున్న నిరుద్యోగుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అశోక్‌నగర్ హస్టల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక అనే ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. శుక్రవారం రోజున రాత్రి హాస్టల్ గదిలో ఆమె ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక హన్మకొండలోని గీతాంజలి కళాశాలలో డిగ్రీ ఎంపీసీఎస్ పూర్తి చేసింది. ప్రవళిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య, తల్లి మర్రి విజయ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్లకు ఉన్నటువంటి ఒక ఎకరంతో పాటు గ్రామంలోని మరి కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ప్రవళికకు తమ్ముడు ప్రణయ్ కుమార్ ఉన్నాడు. పిల్లలను ఉన్నత స్థాయిలో ఉంచాలని కలలు గన్న ప్రవళిక తల్లిదండ్రులు ఆమె డిగ్రీ పూర్తి కాగానే గ్రూప్స్ కోచింగ్‌కు హైదరాబాద్‌కు పంపారు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆర్‌సీ రెడ్డి విద్యా భవన్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. దాదాపు 6 నుంచి 7 లక్షల రూపాయలను రెండు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకు, హాస్టల్ ఫీజులకు చెల్లించారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడింది. ఇన్ని రోజులు తీసుకున్న కోచింగ్, తల్లిదండ్రులు పెట్టిన డబ్బు వృధా అవుతోందని ప్రవళిక మనస్తాపానికి గురైంది. హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ.. ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రవళిక. రెండు సంవత్సరాలుగా గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివేది. అయితే పరీక్షలు వాయిదా పడటంతో.. కోచింగ్ సెంటర్, హాస్టల్‌కు ఫీజులు కట్టడం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అవుతుందని ప్రవళిక తీవ్రంగా మనస్తాపం చెందింది.

తన రూంలో ఉంటున్న స్నేహితులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రవళిక ఉరి వేసుకొని కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె స్నేహితులు హాస్టల్ నిర్వహకునికి, పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రవళిక గురించి తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమె మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అంటూ విద్యార్థులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. తమ తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి తమ జీవితాలతో ఆడుకుంటుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కిందకు చేరుకొని ఆందోళనలు చేశారు. పది సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించకపోవడం.. అలాగే ఇప్పుడు మరోసారి వాయిదా వేయటంతోనే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు మండిపడ్డారు. ప్రవళిక మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆందోళన చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో విద్యార్థులు, విద్యార్థి నేతలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.

Also Read: ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు..

ఇదిలా ఉండగా.. విద్యార్థిని ప్రవళిక మృతిపై డీసీపీ వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రైవేట్ హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్ గురించి రాత్రి 8 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే హాస్టల్‌కు చేరుకొని ప్రవళిక రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆ సూసైడ్ నోట్‌లో.. 'నన్ను క్షమించండి అమ్మా, నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీకోసం నేను ఏం చేయలేకపోతున్న అమ్మా' అంటూ రాసుకొచ్చింది. ప్రవళిక మృతదేహాన్ని గాంధీఆసుపత్రికి తరలించిన పోలీసులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రమానికి తరలించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ఇలా అర్థాంతరంగా కన్నుమూయడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

చనిపోయే ముందు తమ బిడ్డ ఫోన్‌ చేసిందని..కానీ తనకు విషయం చెప్పలేదని ప్రవళిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రవళిక మృతిపై పలు ఆమె సోదరుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ప్రవళిక ఫోన్‌ కూడా మాకివ్వలేదని..పోలీసులను అడిగితే ఇప్పుడివ్వలేమని చెబుతున్నారంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ప్రవళిక స్వస్థలం బిక్కాజిపల్లిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. భారీ భద్రత మధ్య ప్రవళిక అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబసభ్యులు. ఇంటికి దూరంగా వచ్చి హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వుతున్న అమ్మాయి..ఉన్నట్లుండి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణాతీతంగా మారింది. కన్నవారితో పాటు ఊరు ఊరంతా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రవళిక మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

#telangana-news #tspsc-exams #tspsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe