Pulses Price: ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల రేట్లు ఆకాశానంటుతున్నాయి. వీటికి పప్పులు ధరలు కూడా తోడుగా వచ్చాయి. దీంతో సామాన్యుడికి పప్పన్నం అందనంత దూరం వెళ్లేట్లు కనిపిస్తుంది. రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు ధర నెల రోజుల క్రితం రూ. 150 నుంచి రూ.160 ఉండగా..ప్రస్తుతం రూ.180 నుంచి రూ. 200 ధర ఉంది.
ఇక సూపర్ మార్కెట్లలో అయితే కిలో రూ. 220కు అమ్ముతున్నారు. అలాగే, మినపప్పు ధరలు కిలో నెల క్రితం రూ. 90 నుంచి రూ. 120 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 140 నుంచి రూ.160 వరకు ధర పలుకుతోంది. పెసర పప్పు ధర కిలో రూ. 80 నుంచి రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 110 నుంచి రూ.120కి చేరింది.
అలాగే, శనగ పప్పు కిలో ధర రూ. 90 పలుకుతోంది. ఈ సారి రాష్ట్రంలో పప్పుధాన్యాల పంటల ఉత్పత్తి తక్కువగా ఉండడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరో ఆరు నెలలపాటు కొత్త పంట చేతికి వచ్చే వరకూ ధరలు తగ్గే అవకాశం ఉండదని అంటున్నారు.