CV Anand: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోలీస్ దంపతులు ఎస్‌ఐ భావన, రావుకిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు. అనంతరం కొత్త జంటకు సీవీ ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా పంజాగుట్ట పోలీస్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ భావనతో ఏఆర్ ఎస్సై కిషోర్ వివాహం జరిగింది. వీరి వివాహం గత నెల ఆగస్టు 26న జరుగగా.. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. అయితే, ఈ షూటింగ్ స్పాటే ఇప్పుడు వివాదాస్పదమైంది. రకరకాల లొకేషన్లలో ప్రీవెడ్డింగ్ షూట్ చేసిన ఈ జంట.. మొదటి షాట్ మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అది ఖాకీ డ్రెస్ ధరించి, పోలీస్ వాహనం ఉపయోగించారు. దాంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు రచ్చ క్రియేట్ చేస్తోంది. ఇద్దరూ సినిమా రేంజ్‌లో ఖాకీ డ్రెస్‌లో ఫోజులు ఇస్తూ ప్రీవెడ్డింగ్ షూట్‌లో తళుక్కుమన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సదురు ఎస్సైలు భావన, కిషోర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఈ ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించడంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించిన విషయమూ విధితమే. ‘పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్‌పై మిశ్రమ స్పందనలు చూశాను. నిజాయితీగా చెప్పాలంటే.. వారు తమ వివాహం విషయంలో కొంచెం ఎక్కువగా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. వాస్తవానికి ఇది గొప్ప శుభవార్త. కానీ, కొంచెం ఇబ్బందిగా మారింది. పోలీసింగ్ అనేది చాలా కఠినమైన పని. ముఖ్యంగా మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది. ఆమెకు(మహిళా ఎస్‌ఐకి) డిపార్ట్‌మెంట్‌లోనే జీవిత భాగస్వామి దొరికినందుకు మనందరం సంతోషించాలి. ఈ ఇద్దరు పోలీసు అధికారులు.. డిపార్ట్‌మెంట్ ప్రాపర్టీ, చిహ్నాలను ఉపయోగించడంలో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు. అయితే, వారు మాకు ముందే తెలియజేసి ఉంటే.. మేమే ఖచ్చితంగా షూట్‌కి అనుమతి ఇచ్చేవాళ్లం. మనలో కొందరికి ఆగ్రహావేశాలు కలగవచ్చు. కానీ, అది సరికాదు. వారి పెళ్లికి నన్ను పిలవనప్పటికీ.. వారిని కలుసుకుని ఆశీర్వదించాలని భావిస్తున్నాను. అయితే, ఇలాంటి ఘటనలు పునరావృకాకుండా సిబ్బంది తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఏదైనా అనుకుంటే.. ముందుగా సంబంధిత అధికారుల నుంచి సమ్మతి తీసుకోవాలని ఇతరులకు నేను సలహా ఇస్తున్నాను’ అంటూ చాలా కూల్‌గా రియాక్ట్ అయ్యారు సీపీ.