Prashant Kishor vs Jagan: గతం.. అది జూలై 2017.. ఏపీలో గుంటూరు.. వైసీపీ ముఖ్య సమావేశం.. ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేశారు. ఆయన ప్రశాంత్ కిషోర్. పార్టీ కోసం పనిచేసే రాజకీయ వ్యూహకర్త. ఆయన టీమ్ ఐపాక్. ఈ టీమ్ వైసీపీని 2019లో అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేస్తుంది. ఏమి చేయాలో.. ఎలా చేయాలో.. ఏ పథకాలు ప్రకటించాలో.. ప్రతిపక్షాలను ఏ వ్యూహాలతో నిలువరించాలో అన్నిటికీ తెర వెనుక వ్యూహాన్ని రచించేది ప్రశాంత్ కిషోర్. దానిని తెరపై బలంగా తీసుకు వెళ్ళేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 నెలల పాటు ప్రజా సంకల్ప పాదయాత్ర.. రావాలి జగన్.. కావాలి జగన్ స్లోగన్.. నవరత్నాల పథకాలు.. ఇలా అన్నిటి వెనుకా ప్రశాంత్ కిషోర్ తన మేథస్సును వైసీపీకి అందించారు.
ఫలితం.. చరిత్రలో ఎన్టీఆర్ తరువాత భారీ ప్రజామోదంతో ముఖ్యమంత్రి పీఠంపై జగన్మోహన్ రెడ్డి సగర్వంగా కూచున్నారు. నామ మాత్రపు ప్రతిపక్షంతో.. తిరుగులేని ఆధిపత్యంతో ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు జగన్. మరోవైపు జనసేన గ్లాస్ కనిపించకుండా పోయింది. రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా పేరుపొందిన చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మధ్య ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కట్ చేస్తే..
Prashant Kishor vs Jagan: ఇప్పుడు.. అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశం లేదని కరాఖండీగా చెప్పేశారు. తెలుగుదేశం కూటమికి తిరుగులేని మెజార్టీ వస్తుందని చెప్పేశారు. 2019 ఎన్నికల అనంతరం పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పక్కకి తప్పుకుని.. ఐపాక్ ను వదిలేసి బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తన భవిష్యత్ వెతుక్కుంటూ వెళ్లిపోయారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆయన ఎన్నికల ముందు RTV స్టూడియోలో రవిప్రకాష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సహజంగానే వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.
జగన్ ఏమంటున్నారు?
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఐపాక్ ఆఫీస్ కు వెళ్లిన ఆయన ప్రశాంత్ కిషోర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రశాంత్ కిషోర్ తమ పార్టీ కోసం ఏమీ చేయలేదనీ.. మొత్తం ఐ పాక్ టీమ్ చేసిందనీ చెప్పుకొచ్చారు. ఇప్పటి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ లేకపోయినా తాము ఘన విజయం సాధించబోతున్నామనీ.. ప్రశాంత్ కిషోర్ కి షాక్ ఇచ్చేలా ఫలితాలు ఉండబోతున్నాయనీ ఐపాక్ టీమ్ తో అన్నారు.
Also Read: దెందులూరులో టెన్షన్.. చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు..!
అప్పుడు ఆప్తుడు.. ఇప్పుడు..
Prashant Kishor vs Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏడేళ్ల క్రితం.. తన ఆప్తుడిగా.. వ్యూహకర్తగా గొప్పగా కనిపించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీ నేతకు శత్రువుగా మారిపోవడమే విచిత్రం. ప్రశాంత్ కిషోర్ రవికిశోర్ తో చెప్పిన దాని ప్రకారం ఏడాదిన్నర క్రితం కూడా జగన్ ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. అప్పుడే వైసీపీ గెలుపు కష్టమని తాను చెప్పినట్టు ఆయన వెల్లడించారు. అయితే, 151 సీట్లలో తాము గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేసినట్లు ప్రశాంత్ కిషోర్ వివరించారు. కానీ, జగన్ మాత్రం ఎన్నికలకు ముందు 175 సీట్లలోనూ వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ తానెప్పుడూ జగన్ ని కలవడం లేదా మాట్లాడటం జరగలేదన్నారు.
ఏడేళ్ల బంధం.. ఎందుకు తెగింది?
Prashant Kishor vs Jagan: రవిప్రకాష్ ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ను మీ మధ్య బంధం ఎందుకు తెగిపోయింది? అని ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ కిషోర్ సూటిగానే సమాధానమిచ్చారు. “వైసీపీకి లేదా జగన్ కు కృతజ్ఞత అనేది లేదు. వారు అధికారంలోకి రావడానికి కారణమైన వారికి కనీసం కృతజ్ఞతా భావం చూపించాలనే కనీస మర్యాద కూడా లేదు. కృతజ్ఞతా భావం లేని వారిని నేనే కాదు.. ప్రజలు కూడా హర్షించరు” అని ప్రశాంత్ చెప్పారు. కృతజ్ఞత మాట పక్కన పెడితే, తనను విపరీతంగా విమర్శించారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
మొత్తంగా చూసుకుంటే, ప్రశాంత్ కిషోర్ అప్పట్లో తమకు సహాయం చేస్తున్నారు కాబట్టి.. ఆయనను కౌగలించుకున్నారు. ఇప్పుడు తన అభిప్రాయం చెప్పేసరికి ఆయనను దూరంగా పెట్టడమే కాకుండా.. అసలు ఆయన తెచ్చిపెట్టిన ఐపాక్ టీమ్ కీ ఆయనకు సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఓడలు.. బళ్ళు.. బళ్ళు ఓడలు అవడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలికి ఓటమి అవమానం తప్పలేదు. ఇప్పుడు వైసీపీ అధికారం శాశ్వతం అనుకునో.. తామే ఉద్దండులం అనుకునో.. అందరినీ దూరం చేసుకోవడం కనిపిస్తోంది. అదీకాకుండా.. రాజకీయాల్లో అవసరమైతే శత్రువులను కూడా కలుపుకుని పోవాలని చూస్తారు. అందుకే, ఆచి తూచి మాట్లాడతారు. కానీ, ఇప్పటి నయా రాజకీయాల్లో ఆ ధోరణి కనిపించడం లేదు. అదీ ముఖ్యంగా వైసీపీ రాజకీయాల్లో. వారికి నచ్చినట్టు మాట్లాడితే.. వారు తమ వారు. ఏ మాత్రం తేడాగా మాట్లాడినా.. అది మంచి కోసం చెప్పినా పరాయివారు అన్నట్టుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తారు. ఇదిగో ఇలాంటి ధోరణే.. ప్రశాంత్ కిషోర్-జగన్మోహన్ రెడ్డిల దోస్తానాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలు మరికొన్ని రోజుల్లో తేలిపోతాయి. అప్పుడు ఎవరి అంచనా కరెక్టో స్పష్టం అయిపోతుంది. అప్పుడు ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తుందేమో.. అప్పుడు వైసీపీకి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ దేవుడు అయిపోతారేమో. వేచి చూడాలి. ఏమో గుర్రం ఎగరా వచ్చు.. ఏమంటారు?