Telangana : తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలుచేసేందుకు నిర్వహించిన ప్రజాపాలనకు అనూహ్య స్పందన లభించింది. కోటి మందికి పైగా ప్రజలు తరలివచ్చి వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 28న మొదలైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జనవరి 6వ తేదీతో (శనివారం) ముగిసింది. ఆఖరి రోజు దరఖాస్తులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు.
8 రోజులు సాగింది..
దాదాపు 8 రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజల వద్ద నుంచి అధికారులు అప్లికేషన్లు స్వీకరించారు. జనవరి 5వ తేదీ నాటికి కోటి 8 లక్షల 94 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆఖరి రోజు దాదాపు 12 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సమాచారం.
Also Read : Praja Palana: ముగిసిన ప్రజాపాలన.. ఎక్కువ దరఖాస్తులు దీనికే?
17 లోపు డేటా ఎంట్రీ..
ఈ దరఖాస్తులన్నింటినీ ఎంట్రీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం. వీటన్నింటినీ ఈ నెల 17వ తేదీ లోపు ప్రత్యేక సిబ్బందితో కంప్యూటర్లలో అప్‌లోడ్ చేయనున్నారు. పండుగ తర్వాత వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి పథకాల వారీగా విభజించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల లిస్టును తయారు చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు, ఇతర అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
నాలుగు నెలల తర్వాత మరోసారి..
ప్రజాపాలన గడువు ముగియడంతో దరఖాస్తులు సమర్పించని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కారు చెబుతోంది. నాలుగు నెలల అనంతరం మరోసారి ప్రజాపాలన నిర్వహిస్తామని ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వని వారందరికీ అవకాశం కల్పిస్తామని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో దరఖాస్తులు భారీగా వచ్చినప్పటికీ.. ఇంకా చాలా మంది దరఖాస్తు సమర్పించలేదని తెలుస్తోంది. అయితే రేపటి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన రాలేదు.
Also Read : BREAKING: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం