Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో ఆకతాయిలు దారుణానికి పాల్పడ్డారు. ఓ హిందూ దేవాలయంపై ఏకంగా పోర్న్ స్టార్ పోస్టర్లు పెట్టి హంగామా చేశారు. దేవుళ్లతో సమానంగా ఆమెకు పూజలు నిర్వహిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చివరికీ అధికారులు కలగజేసుకుని బాధితులపై చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుండగా ఈ వేడుకను కొద్ది రోజుల పాటు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లియమ్మన్ ఆలయాల వద్ద పండుగ దీపాలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో దేవత ఫొటోలతో పాటు, మియా ఖలీఫా ఫొటో దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. ఆమె పండుగ సాంప్రదాయ నైవేద్యాలలో భాగమైన 'పాల్ కుడం' (పాల పాత్ర)ను ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా కనిపించింది. అంతేకాదు హోర్డింగ్‌లో కుర్రాళ్లు తమ పేర్లను కూడా ముద్రించుకోవడం విశేషం. కాగా భక్తులు, పూజారుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టర్ ను తొలగించారు. బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.