తాగునీరు, కరెంట్, విద్య ప్రజల కనీస అవసరాలు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బీహార్ ఒకటి. కరెంట్ కొరత తీర్చమన్నందుకు బీహార్ సర్కార్ సామాన్యుల పై తన ప్రతాపాన్ని చూపించి...ముగ్గరిని బలి తీసుకుంది. ఈ ఘటన బుధవారం కతీహార్ జిల్లాలో చోటు చేసుకుంది.
నిత్యం విద్యుత్ కోతలతో విసిగిపోయిన జనం..ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారులు వారి మీద కాల్పులు జరిపారు. కరెంటు కావాలని అడిగిన పాపానికి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు మరణించారు.
రోజులో కనీసం ఒక గంట కూడా పూర్తిగా కరెంట్ ఉడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నమంటూ స్థానికులు బార్సోయ్ బ్లాక్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసన కార్యక్రమం చేపట్టిన వారికి పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా..చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఈ విషయం కతీహార్ జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు అధికారులు కూడా భారీగా బలగాలతో మోహరించారు.
ఓ నిరసనకారుడు మాట్లాడుతూ ‘శాంతియుతంగానే నిరసన చేస్తున్నాం. కానీ పోలీసులు మాపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురికి బుల్లెట్ గాయాలు కాగా.. ముగ్గురు మరణించారు’ అని తెలిపారు.