విశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకి అన్ని రకాల ఏర్పాట్లను జనసేన పార్టీ సిద్ధం చేసింది. ఈ యాత్రకు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండ విడతల యాత్ర పూర్తి చేసిన యాత్రకి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ యాత్ర కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారాహి యాత్రకి పోలీసులు పలు ఆంక్షలు విధించారు.
మూడో విడత వారాహి యాత్రకు కొన్ని షరతులతో, పలు నిబంధనలు జారీ చేశారు పోలీసులు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రావద్దని పోలీసులు చెప్పారు. అలాగే విశాఖలోని జగదాంబ జంక్షన్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఈ యాత్రలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అంటూ పోలీసులు షరతులు విధించారు. కార్యకర్తలు, అభిమానులు భవనాల పైకి ఎక్కుకుండా చూసే బాధ్యత జనసేనదేనన్నారు పోలీసులు.
పోలీసులు విధించిన ఆంక్షలపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అలాగే పోలీసులు పెట్టిన షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. పవన్ పర్యటనల నేపథ్యంలో.. వారాహి విజయ యాత్రలో గజమాలలు వేయవద్దని జనసేన కార్యకర్తలకు సూచించింది. భద్రత కారణాలను నాయకులు, శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది.
ఇక విశాఖ పట్టణం వేదికగా మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రత గురించి నిబంధనలను నాయకులు, శ్రేణులు పాటించాలని కోరుతున్నామని తెలిపింది పార్టీ. ఇందులో భాగంగా వారాహి విజయ యాత్రలో, సభా వేదికల వద్ద గాని క్రేన్లతో భారీ దండలు, గజమాలలు వేయడం లాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టవద్దని సూచించారు.
పవన్ కళ్యాణ్ భద్రతకు భంగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సహకరించాలని జనసేన ట్విట్టర్ వేదికగా సూచించింది. యాత్ర వెళ్లే మార్గంలో భారీ క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదన్నారు. మూడో విడత వారాహి యాత్ర 19వ తేదీ వరకు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన ప్రకటించింది.