PM Modi At Tirumala Temple: తిరుమల తిరుపతి స్వామి వారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు రచన అతిథి గృహం నుంచి బయల్దేరి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ వాహన మండపం వద్ద నుంచి నడుచుకుంటూ ఆయన స్వామి వారి ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్నారు.
ఆయనకు టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకపాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ నుదుటి పై తిరునామం తో సంప్రదాయ వస్త్రాలు ధరించి దర్శనానికి వచ్చారు. ముందుగా మోదీ ధ్వజ స్తంభానికి నమస్కరించి ఆ తరువాత ఆలయం లోపలికి వెళ్లారు.
స్వామి వారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపానికి చేరుకున్న మోదీకి (Modi) వేద పండితులు వేదాశీర్వాదం అందించారు.
మోదీని చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి శేష వస్త్రం కప్పి స్వామి వారి తీర్థ ప్రసాదాలు , చిత్ర పటాన్ని అందించారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన మోదీ నేరుగా అతిథి గృహానికి చేరుకున్నారు.
కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆయన అల్పాహారాన్ని తీసుకున్న తరువాత ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. . ప్రధాని హోదాలో ఆయన తిరుమలకు (Tirumala) రావడం ఇది నాలుగోసారి. ఆయన తిరుపతి నుంచి నేరుగా తెలంగాణకు వస్తారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారు. మోదీ పర్యటన నేపధ్యంలో స్వామి వారి ఆలయ సమీపాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి.