Paytm Shares: ఆర్బీఐ పేటీఎం పై చర్యలు తీసుకున్నప్పటి నుంచి పేటీఎం షేర్లు కిందికి దిగజారిపోతూ వస్తున్నాయి. పేటీఎం చరిత్రలో లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే పేటీఎం షేర్లు 40% పడిపోయాయి. ఈరోజు ఇది 20% తక్కువ సర్క్యూట్‌లో ట్రేడ్ అవుతోంది. ఆర్బీఐ (RBI) ప్రకటనకు ముందు పేటీఎం షేర్ 761 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యేది. ఈరోజు అది 487 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్షీణత కారణంగా కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది మరింత పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిబంధనలు సరిగా పాటించడం లేదంటూ ఆర్బీఐ జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో స్టాక్ మార్కెట్లో (Stock Market) ఆ కంపెనీ షేర్లు(Paytm Stocks) పడిపోవడం ప్రారంభమైంది. షేర్ల ధర పతనంతో కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా భారీగా పడిపోయింది. కంపెనీ వాల్యుయేషన్ కు రెండు రోజుల్లోనే భారీ నష్టం వాటిల్లింది. డేటా ప్రకారం, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,378.41 కోట్లు తగ్గి రూ.30,931.59 కోట్లకు చేరుకుంది.
ఒకపక్క వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు , సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) స్పందించారు. తమ కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తున్నందున పేమెంట్స్ బ్యాంక్ కాదని అన్నారు. దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు మద్దతు ఉందని శర్మ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వ్యాపారం ప్రభావితం కాదని శర్మ పేర్కొన్నారు. ఈ చర్య పై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను అందించలేదంటూ చెప్పారు.
Also Read: Paytm బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు.. మరి డిజిటల్ పేమెంట్స్ మాటేమిటి?
అయితే, ఆయన చెప్పినది పేటీఎం డిజిటల్ పేమెంట్స్ విషయంలో నిజమే కావచ్చు. కానీ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) విషయంలో మాత్రం పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే, పేటీఎం డిజిటల్ ప్లాట్ ఫారమ్ అలానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రెండూ కూడా One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు One97 కమ్యూనికేషన్స్ (One97 Communications) లిమిటెడ్ షేర్ విలువ.. మార్కెట్ విలువ పూర్తిగా కిందికి జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు నష్టాల్లో పడిపోయారు. ఇప్పుడు ఈ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టినవారిపైనే ఆర్బీఐ చర్య నేరుగా ప్రభావం చూపిస్తుందనేది నిజం. ఇప్పుడు కంపెనీ ఆర్బీఐకి ఎటువంటి సమాధానం చెప్పినా.. లేక ఈ నిషేధాన్ని మళ్ళీ ఆర్బీఐ పరిశీలించి సడలింపులు ఇచ్చినా కూడా పేటీఎం స్టాక్స్ లో (Paytm Stocks)ఇన్వెస్ట్ చేసినవారికి నష్టం భారీగానే ఉన్న నేపథ్యంలో కోలుకోవడం కూడా కష్టమే అని నిపుణులు అంటున్నారు.
మొత్తంమీద చూస్తే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ కొరడా.. ఆయా బ్యాంక్ డిపాజిటర్లు కంటే.. ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ ను నిలువునా ముంచేసింది అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండే రిస్క్ ఎలా ఉంటుందో పేటీఎం మళ్ళీ రుజువు చేసింది.
Watch this interesting Video: