Mangalagiri: తన కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని చోడవరానికి చెందిన సోమాదుల కృప అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దానిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి క్లోజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. కబ్జాలు, ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలని కోరుతూ పవన్ కల్యాణ్ కు వినతిపత్రం అందించారు.
మీ సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని పవన్ కల్యాణ్ ను కోరారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నర భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన కృష్ణవేణి అనే మహిళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
తమ భూమి తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన పలువురు మహిళలు తమకు సొంత ఇల్లు లేదని, రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళ పెన్షన్ రావడం లేదని పవన్ కళ్యాణ్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలోని అవకతవకలపై ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని పవన్ కల్యాణ్ కు అందించారు. సీనియర్ సిటిజన్స్ సైతం డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఇది కూడా చదవండి: AP: పబ్జి ఆడిన ఉద్యోగి.. ఎమ్మెల్యే సీరియస్ యాక్షన్..!