ఎన్నికలు (Telangana Elections 2023) దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలను రచిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానం నుంచి జనసేన నేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపు అందింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పవన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తుపై వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఆంధ్రలో పొత్తుల అంశంపై కూడా వీరు చర్చిస్తారని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా?
పవన్ కల్యాణ్ ను కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 27న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కానీ.. సడెన్ గా పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది.
సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల ఖరారును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ హైకమాండ్ జనసేనతో పొత్తును త్వరగా ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జనసేన పార్టీ దాదాపు 20 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ 8-10 సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధం అవుతోంది. ఈ రోజు బీజేపీ అగ్రనేతలతో జరిగే పవన్ కల్యాణ్ భేటీలో సీట్ల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు కుదిరితే పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తనకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఆయన ప్రచారంలోకి దిగితే తమకు ఇక తిరుగు ఉండదని అంచనా వేస్తోంది కమల దళం.