CAA : లోకసభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్(Modi Sarkar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అటు అధికార పార్టీ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మత విభజనను ప్రోత్సహించేందుకు ఈ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తేల్చి చెప్పారు. కేంద్రం చర్యను ఆయన తప్పుబడుతున్నారు. దక్షిణాది రాష్ట్రం కేరళలో దీన్ని అమలు చేయమని స్పష్టం చేశారు. ముస్లీం, మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ చట్టాన్ని కేరళలో అమలు చేయమని ఇప్పటికే తమ సర్కార్ ఎన్నో సార్లు చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటకే కట్టుబడి ఉంటామన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని విజయన్ కోరారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికి వ్యతిరేకమైంది అన్నారు.
కేజ్రివాల్ స్పందన:
సీఏఏ(CAA) అమలుపై ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి కేజ్రివాల్(CM Kejriwal) స్పందించారు. లోకసభ ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో స్పందిస్తారని కేజ్రివాల్ అన్నారు.
శరద్ పవార్:
వివాదాస్పదమైన ఎన్నికల బాండ్ల అంశం నుంచి ప్రజలను ద్రుష్టి మళ్లించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు.
దిగ్విజయ్ సింగ్:
సీఎఎ అమలు రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రతి అంశాన్నీ హిందువులు, ముస్లింల మధ్య విభజనగా తీసుకువస్తుందంటూ ఆరోపించారు.
అఖిలేశ్:
ఉద్యోగాలకోసం మన దేశ పౌరులు విదేశాలకు వెళ్తుంటే..ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం లాభం ఉంటుందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు.
ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నట్లు: ఎంపీ అసదుద్దీన్
సీఎఎను అమల్లోకి తీసుకురావడంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఏఏపై మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఐదేండ్లుగా పెండింగ్ లో ఉన్న సీఏఏను ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. వీటికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి : కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ గుడ్‌న్యూస్..!