Lotus symbol in G20 Logo: ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సుపైనే ఉంది యావత్ ప్రపంచం చూపు. ఈ ఏడాది జీ20 సమావేశానికి ఆతిధ్యమిస్తోంది భారత్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి రూపొందించిన లోగోపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జీ20 సమావేశాల లోగోలో కమలం, భూమితో కూడిన లోగోను రూపొందించింది ప్రభుత్వం. G-20 లోగో కింద భారత్ అని రాశారు. జాతీయ జెండా నుంచి పొందిన స్ఫూర్తితో మూడు రంగుల్లో ఈ లోగోను రూపొందించారు. అలాగే వసుదైక కుటుంబం-అంటే ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు అనే థీమ్‌తో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
లోగోలో కమలం గుర్తుపై అభ్యంతరం..
అయితే జీ 20 లోగోపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. లోగో, థీమ్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించిన తర్వాత.. లోగోలో కమలం గుర్తుపై అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. బీజేపీ ఎన్నికల గుర్తే..భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సదస్సు లోగోగా మారిపోయిందని విరుచుకుపడింది. తమను తాము ప్రచారం చేసుకోవడానికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదని నిప్పులు చెరిగింది. అసలు బీజేపీ, మోదీలకు సిగ్గు లేదా అంటూ ఫైరయ్యారు ఆ పార్టీ నేతలు. ఇక ఆ లోగోలో కమలం గుర్తుకి బదులు..ఏదైనా చిహ్నాన్ని పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు మరికొందరు.
Also Read: జీ 20 అతిథులకు ఇడ్లీ. చిట్టిగారె, మసాలా దోశె!
బీజేపీ కౌంటర్ ఎటాక్..
తాజాగా సీపీఐ నేత నారాయణ జీ20 సమావేశాల గుర్తు కూడా కమలం పెట్టారని మండిపడ్డారు. అలాగే అర్జెంట్‌గా ఇండియా పేరును భారత్ అని మార్చాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ..కేంద్రం ఇండియా అనే మాటను కనపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐతే గతేడాది లోగో ఆవిష్కరించిన ప్రధాని..కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం ఆశకు ప్రతీక అని.. ఎలాంటి దారుణ పరిస్థితుల్లోనైనా కమలం వికసిస్తుందని..అలాగే ప్రపంచం ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా కొత్త ఆశలను ఈ జీ20 లోగో చిగురింపచేస్తుందని వివరించారు. మరోవైపు విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కమలం మన జాతీయ పుష్పమని, అలాగే లక్ష్మీదేవి ఆసనమని..అలాంటి కమలాన్ని వ్యతిరేకిస్తారా? అని దుయ్యబట్టింది. ఐతే కమలం గురించి బీజేపీ, మోదీ ఏం చెబుతున్నప్పటికీ ఈ లోగోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: జీ20 సదస్సులో కరీంనగర్ కళాకారులకు అరుదైన గౌరవం