సర్వే వివరాలకు ఆధార్‌ లింకింగ్‌.. నకిలీ ఓట్ల రాజకీయానికి బ్రేక్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమం ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితమని డా.దాసరి కిరణ్‌ అన్నారు. వివరాలు ఆధార్‌కు లింక్ చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక ఎక్స్‌రేలా పని చేయడంతోపాటు నకిలీ ఓట్ల రాజకీయానికి బ్రేక్ పడుతుందని ఆయన చెబుతున్నారు. 

author-image
By srinivas
serer
New Update

Caste census: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని బీసీ కమిషన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రజాభిప్రాయసేకరణకు ముందుకొచ్చింది బీసీ కమిషన్. దానికి సంబంధించిన పనులను తెలంగాణ బీసీ కమిషన్ ప్లానింగ్ కమిషన్‌తో కలిసి 60 రోజుల్లోగా పూర్తి చేయాలంటూ ఉత్తర్వులు (జీవో 18) ప్రభుత్వం 2024, అక్టోబర్ 11న విడుదల చేసింది. అయితే దీనికి మొదటి నుండి ఎన్నో అడ్డంకులు సృష్టించబడుతూనే ఉన్నాయి. దీంతో అసలు సమగ్ర గణన జరుగుతుందా లేదా అనే మీమాంస ప్రజల్లో మొదలైంది. దీనికి తోడు బీసీ సంక్షేమ సంఘం అధినేత ఆర్.కృష్ణయ్య సమగ్ర కుల గణన కోసం బీసీ కమిషన్ కాకుండా వేరే ఒక ప్రత్యేక కమిషన్ వేయాల్సిందే అంటూ హైకోర్టు మెట్లెక్కడంతో మరింత జఠిలమవుతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా ముఖ్యమైన నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే మార్గాల కోసం అన్వేషించింది. తద్వారా అనుకున్న సమయానికే సర్వే మొదలయ్యేలా చర్యలు చేపట్టింది. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా నుండి ప్రజా, కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా సర్వే ప్రారంభానికి ముందు రోజు ఏకంగా "కుల గణన సంప్రదింపుల సదస్సు" పేరిట రాహుల్ గాంధీని హైదరాబాద్‌కు రప్పించి తెలంగాణ సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. 2014లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను మించి తెలంగాణలో జరుగుతున్న ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే చాలా ప్రామాణికంగా చేపట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే మొదలైన సందర్భంగా దీనికి సంబంధించిన పలు అంశాలను, న్యాయపరమైన పరిష్కార మార్గాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ఈ ప్రయత్నమే మా జన అధికార సమితి ఉద్దేశం.

డెడికేటెడ్ బూసాని కమిషన్‌కు స్వాగతం..


తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన "సమగ్ర కుల గణన" సర్వే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో బీసీ కమిషన్ చేపడుతుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య హైకోర్టు గద్దెనెక్కారు. దీనికి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చింది. ఈ తీర్పు ప్రకారం, సమగ్ర కుల గణన సర్వే చేయడానికి బీసీ కమిషన్ కాకుండా, ఒక ప్రత్యేక కమిషన్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంబడే తేరుకున్న ప్రభుత్వం, సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని, తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్టు ఒక గట్టి సంకేతాన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే సర్వే మొదలయ్యే రెండు రోజుల ముందు మాత్రమే ఈ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో అసలు వారి విధి విధానాలేంటో కూడా తెలుసుకునే సమయం కూడా ఇవ్వకుండా పని అప్పగించినట్టుంది. ఎంతో గొప్పగా తీసుకున్న ఇలాంటి నిర్ణయాల్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఇలాంటి వాటిని ముందే పసిగట్టి ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తే మరింత బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, సమగ్ర కుల గణన సర్వే ఎలాంటి అడ్డంకులు లేకుండా సవ్యంగా సాగేలా చూడడం కోసం ఏర్పడ్డ బూసాని వెంకటేశ్వరరావు కమిషన్‌కు స్వాగతం పలుకుతున్నాం. 

నకిలీల నివారణ ఎలా?  


భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా నకిలీ ఓట్ల రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు మొదలుపెట్టిన సకల కుల గణనలో కూడా నకిలీల వివరాలు చేర్చే అవకాశాలను ఎలా నివారిస్తారో చెప్పలేదు. ఎందుకంటే, ఒక కుటుంబంలో తల్లి తండ్రితో పాటు పెళ్లి అయిన కొడుకు-అల్లుడు వారి పిల్లలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఊర్లల్లో ఉండే తల్లిదండ్రులు తమ తమ పిల్లల వివరాలను చేరిస్తే ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లాంటి నగరాల్లో నివసించే వారి వివరాలు రెండు చోట్ల సేకరించే అవకాశాలుంటాయి, వీటిని ఎలా లెక్కిస్తారో చెప్పలేదు. ఇంతేకాకుండా, మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో నివసించే వారి వివరాలు ఎలా సేకరిస్తారో చెప్పలేదని కొందరు ఎన్నారైలు వాపోతున్నారు. భవిష్యత్తులో ప్రామాణికంగా తీసుకోబోతున్న ఈ సర్వేలో మన వివరాలు లేకపోతే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చి తీరుతాయేమోనన్న అనుమానం చాలా మంది మెదళ్లలో మెదులుతోంది. దీనిపై డెడికేటెడ్ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, ప్రభుత్వం గానీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని దూరపు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ఓటర్లు కోరుతున్నారు. కావున ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.

సంచార జాతుల లెక్కలు తేలేనా?
బతుకుదెరువు కోసం తరతరాలుగా చేస్తున్న వృత్తిని నమ్ముకుని వేర్వేరు ప్రాంతాలకు వెళుతూ తమకంటూ ఒక స్థిర నివాసం లేని సంచార కులాల వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించడం ఎలా సాధ్యమో ప్రభుత్వం గానీ కొత్తగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ గానీ చెప్పాలి. లేదంటే కనీసం బీసీ కమిషన్ న్యాయపరమైన కొన్ని విధివిధానాలు నిర్ణయించాలి. వాటి ప్రకారం వారిని ఎలా గుర్తిస్తారో, వారి వివరాలు ఎలా సేకరిస్తారో చెప్పాలి. లేకపోతే సంచార కులాల వారి సంఖ్య తక్కువగా కనబడే సమస్య వస్తుంది. వీరితో పాటు స్వస్థలాన్ని వదిలి వేర్వేరు రాష్ట్రాల్లో దేశాల్లో లక్షలాది మంది నివసిస్తున్నారు. వారి వివరాలను సేకరించడానికి ప్రామాణికత ఏంటో ఇప్పటివరకు చెప్పలేదు. ఐటీ తదితర ఉద్యోగ అవకాశాల మూలంగా తమ స్వంత రాష్ట్రాన్ని వదిలి వేర్వేరు ప్రదేశాలకు ముఖ్యంగా బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, పూణే లాంటి పట్టణాలకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అందులో చాలా మందికి ఓటు హక్కు, ఆస్తులు తదితరాలు ఇక్కడే ఉంటాయి. మరి అలాంటప్పుడు వారి వివరాలు ఎక్కడ ఎవరిస్తారు? ఎలా ఇస్తారు? ఒకవేళ తీసుకున్న వాటిలో నిజమెంత? ఇలా ఎన్నో అనుమానాలు. 

ఆర్థిక, ఉపాధి, విద్య వివరాలు సరైనవేనా?
సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కులం పేరిట జరుగుతున్న ప్రస్తుత సర్వేలో ప్రజలు తమ ఆర్థిక, ఉపాధి వివరాలు అన్నీ నిజాలే చెప్తారని నమ్మకం ఏంటి? భవిష్యత్తులో వచ్చే ఇంకమ్ టాక్స్ తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆస్తిపాస్తులను తక్కువ చేసి చూపించే అవకాశాలు అధికం. అందులోనూ కుటుంబం మొత్తం వివరాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి, భవిష్యత్తులో వారి టాక్స్ స్లాబ్ మారే అవకాశం ఉంటుంది. దానితో ఎక్కువ టాక్స్ కట్టవలసి వస్తుంది. దీనికి ఎంతమంది సంసిద్ధంగా ఉంటారన్నది ఆలోచించదగ్గ విషయం. ఇక విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా పలు అనుమానాలు ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకి వచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు దేశ విద్యా వ్యవస్థను తలాకుతలం చేస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలు గౌరవ డాక్టరేట్‌ల పేరిట డిగ్రీలు ప్రధానం చేస్తున్నాయి. ఇక దొంగ సర్టిఫికెట్‌ల గురించి చెప్పనక్కరలేదు. వీటికి తోడు విదేశాల్లో చదివిన చదువులు ముఖ్యంగా ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చదివి ఇక్కడి అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కానివారి పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి. ఇలాంటి వివరాలు సరిగ్గా సేకరించకపోతే మరి ఈ సర్వే ఎందుకు? ఒక్క సకల కులగణన పేరిట చేస్తే సరిపోయేది కదా. కానీ అలా జరగడం లేదు. ప్రస్తుతం తలపెట్టిన సర్వే సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే. కావున ఇంత భారీగా తలపెట్టిన సర్వే సరిగ్గా చేస్తే, భవిష్యత్తులో విద్య, ఉపాధి, ప్రభుత్వ పథకాలకు ఒక ప్రామాణికంగా తీసుకునేలా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి. 

ఆధార్‌కు లింక్ కాదా సర్వరోగ నివారిణి?
సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల తదితర వివరాలను సేకరించడం కోసం చేపట్టిన ప్రస్తుత సకల కుల గణన సర్వేలో ఎన్నో అనుమానాలు ప్రజలను వేధిస్తున్నాయి. ఆయా ప్రతి సమస్యకు ఆధార్ లింక్ చెయ్యడం ద్వారా పరిష్కరించవచ్చని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం. ఎందుకంటే ఆధార్ నెంబర్ అనేది ఏకైక గుర్తింపుగా పరిగణింపబడుతుంది. గత కొన్నేళ్లుగా మన దేశంలో ప్రతి ఆర్థిక లావాదేవీలకు ఆధార్‌ను లింక్ చేస్తున్నారు. దీనివల్ల అక్రమ లావాదేవీలను అరికట్టడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ప్రస్తుతం సేకరించ తలపెట్టిన సామాజిక, రాజకీయ, ఆర్ధిక, విద్య, ఉపాధి, కుల వివరాలను ఆధార్‌కు లింక్ చేయడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఏ కుటుంబంలో ఎవరేం చేస్తున్నారు, ఎవరెంత సంపాదిస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరికెన్ని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు ఎవరు అమ్ముకున్నారు.. తదితర వివరాలన్నీ నిల్వ చేయబడతాయి కావున ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక డీఎన్ఏ పరీక్షగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కావున ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆలోచించి, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అమలుచేయాలని, తద్వారా భవిష్యత్తు లావాదేవీలను చట్టపరం చేసేందుకు ఒక మార్గం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి ఒక వినూత్న ప్రక్రియ ద్వారా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరుగబోయే జన గణనకు ఆదర్శంగా నిలుస్తారని కూడా విన్నవించుకుంటున్నాం. సేకరించే వివరాలన్నింటినీ ఆధార్‌కు లింక్ చేయడం ద్వారానే ఈ సర్వే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎక్స్‌రే లా కూడా పని చేస్తుంది. కావున ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి.

- డా. దాసరి కిరణ్‌ Ph.D. (USA)
అధికార ప్రతినిధి, జన అధికార సమితి

 

#telangana #cm-revant #caste-based-survey
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe