ఇంట్లో ఉదయాన్నే అల్పాహారం కింద ఇడ్లీలు చేస్తే ..అబ్బా ఇడ్లీనా అంటాం. కానీ ఆ అబ్బా ఇడ్లీనే నేడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుందంటే నమ్ముతారా?. ఇది నిజం. తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కొన్ని వేల మందికి దారి చూపిన ఓన్లీ ఇడ్లీ అధినేత లావణ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లావణ్యది చెన్నై. ఇడ్లీ తయారు చేయడమంటే అంతా తెలికైన పని కాదు. పిండి రుబ్బి, దానిని రాత్రంతా ఉంచి మరుసటి రోజు కానీ ఇడ్లీ వేయడానికి కుదరదు. సుమారు ఈ ప్రాసెస్ జరగడానికి 12 గంటల సమయం పడుతుంది. మొదట ఈ ఓన్లీ ఇడ్లీ కాన్సెప్ట్ ను నలుగురు మహిళలతో ప్రారంభించారు.
మొదట వారు ఇడ్లీను ఉచితంగా ఆ చుట్టుపక్కల వారికి అందజేసేవారు. వారు బాగున్నాయని అని చెప్పిన మాటలే వారిని ముందుకు నడిపించాయి అనొచ్చు.ప్రారంభించగానే అయిపోలేదుగా..దానిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. దాని ప్రచారం కోసం కాలేజ్‌లు, క్యాటరింగ్‌లు, రెస్టారెంట్లు, రకరకాల సంస్థల వద్దకు వెళ్లి తన ఇడ్లీ గురించి వివరించే వారు లావణ్య.
అలా ఒకరి నుంచి ఒకరికి తెలియడంతో ఆర్డర్లు రావడంతో పాటు పాపులారిటీ కూడా పెరిగింది. ఈ ఇడ్లీలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు..విదేశాలకు కూడా పంపిణీ ఉంది. మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నట్లు లావణ్య తెలిపారు. దూరదేశాలకు పంపినప్పుడు ఇడ్లీలు పాడైపోకుండా ఉండేందుకు వీరు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.
విదేశాలకు ఇడ్లీలు పార్శిల్ వెళ్లినప్పుడు ముందు కాసేపు నీటి ఉంచి తరువాత ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే ఇడ్లీలు తయార్. ఇప్పటి వరకు ఈ సంస్థకు 1000 మందికి పైగా హోల్ సేలర్స్ ఉన్నారు. పలువురికి డీలర్ షిప్ ఇచ్చి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.కేవలం ఇడ్లీ ల ద్వారా లావణ్య రోజుకి 20 నుంచి 30 వేలు సంపాదిస్తున్నారు.
ఇడ్లీలు ఎప్పుడూ ఒకే ఆకారంలో ఉంటే బాగుంటుంది. అందుకే వివిధ ఆకారాల్లో వివిధ రుచులతో ఇడ్లీలను అందిస్తున్నారు. వారి వద్ద రోజుకి 40 వేల ఇడ్లీను తయారు చేసే మిషన్లు అందుబాటులో ఉన్నట్లు ఆమె వివరించారు.