Onion : సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో రెండు వారాలు ఉల్లి ధరలు (Onion Price) పైకి పెరుగుతున్నాయి. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ఉల్లి ధరలు ఏకంగా సగానికి సగం పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్ (Nasik) లో కిలో ఉల్లి ధర రూ. 17 నుంచి రూ.26కు పెరిగింది.
నాణ్యతతో కూడిన ఉల్లి ధర కిలో దేశవ్యాప్తంగా పలు హోల్‌సేల్ మార్కెట్లలో (Wholesale Market) రూ. ౩౦ గా ఉంది. 2023-24 రబీ దిగుబడులు తగ్గాయనే అంచనాతో ధరలు పెరిగే అవకాశం ఉంటుందనే యోచనతో రైతులు ఉల్లి నిల్వలను బయటకుతీయకపోవడం కూడా సరఫరాలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగిస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో రైతులు, వ్యాపారులు ఉల్లిని పెద్ద మొత్తంలో నిల్వ చేస్తున్నారని, అందుకే ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశానికి తాకాయని వ్యాపారులు వాపోతున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండగా వినియోగదారులు మాత్రం ఉల్లి ధరలను తలుచుకుని కంటనీరు పెడుతున్నారు.