Onion Export Ban: ఒక పక్క రైతుల ఉద్యమాలు.. మరో పక్క ఎన్నిలకు తరుముకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అలర్ట్ అయింది. రైతుల కోసం చెరకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న ఉల్లి ధరలను (Onion Prices) నియంత్రించడానికి చర్యలు మొదలు పెట్టింది. గతంలో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. అప్పుడు పెరుగుతున్న ఉల్లి ధరలు అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ మధ్యకాలంలో నిషేధాన్ని ఎత్తివేసినట్లుగా వార్తలు వెల్లువెత్తాయి. దీంతో ఉల్లిధరలు పెరగడం మొదలైంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఉల్లి ఎగుమతిపై (Onion Exports) నిషేధాన్నిఎత్తివేసినట్లు వచ్చిన వార్తలను వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఖండించారు.
ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు తప్పుడు వార్తల నేపథ్యంలో, దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్‌లో (Lasalgaon) టోకు ధర ఫిబ్రవరి 19న క్వింటాల్‌కు రూ.1,800కి 40.62% పెరిగి పోయింది. ఇది ఫిబ్రవరి 17న క్వింటాల్‌కు రూ.1,280గా ఉంది. ఈ నేపథ్యంలో సింగ్ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ, '’ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేయలేదు. ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిని అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం’’ అని స్పష్టం చేశారు.
'ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు, దాని ఎగుమతిపై (Onion Export Ban)నిషేధం ఇప్పటికే ప్రకటించిన గడువు మార్చి 31, 2024 వరకు కొనసాగుతుంది. ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 2023న ఉల్లి ఎగుమతిని నిషేధించిన విషయం తెలిసిందే.
Also Read: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది
ఉల్లిపై నిషేధం ఎన్నికల వరకు కొనసాగవచ్చు..
PTI చెబుతున్నదాని ప్రకారం, మార్చి 31 తర్వాత కూడా ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగవచ్చు. ఎందుకంటే, వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే ఛాన్స్ ఉంది. మే నెలలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం ఉల్లి ధరలు పెరిగే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు. రబీ (శీతాకాలం) సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో, తక్కువ విస్తీర్ణం కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గవచ్చు.
2023 రబీ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి 22.7 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని అంచనా వేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ఉల్లిని ప్రధానంగా పండించే రాష్ట్రాలలో ఉల్లిపాయల రబీ పంట వాస్తవ పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఉల్లిపై నిషేధం నేపథ్యంలో, అంతర్-మంత్రిత్వ బృందం నుంచి ఆమోదం పొందిన తర్వాత స్నేహపూర్వక దేశాలకు ఉల్లిపాయల ఎగుమతి అవసరం మేరకు అనుమతించే అవకాశం ఉంది.
ఆగస్టులో 40% ఎగుమతి సుంకం విధించారు..
అంతకుముందు ఆగస్టులో, దేశీయ ఉల్లి నిల్వను కొనసాగించడానికి, ధరల పెరుగుదలను ఆపడానికి ప్రభుత్వం ఆగస్టులో 40% ఎగుమతి సుంకాన్ని విధించింది. అక్టోబర్ చివరలో, ఉల్లిపాయల ఎగుమతి కోసం కనీస ఎగుమతి ధర టన్నుకు $ 800 (సుమారు ₹ 66,710)గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ప్రభుత్వం 5 లక్షల టన్నుల ఉల్లిపాయల స్టాక్‌ను బఫర్‌లో ఉంచింది. దీంతోపాటు మరో 2 లక్షల టన్నులు పెంచి 7 లక్షల టన్నులకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.