ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన సరస్సు..ఎక్కడ ఉందో తెలుసా !

ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ సరస్సు, సహజ సౌందర్యంతో సందర్శకులను కట్టి పడేస్తోంది. ఈ లేక్ మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నీటి వనరుగానూ పేరు తెచ్చుకుంది. అయితే ఆ సరస్సు ఎక్కడ ఉందో చూసేయండి!

New Update
ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన సరస్సు..ఎక్కడ ఉందో తెలుసా !

విదేశాల్లోని అద్భుతమైన ప్రకృతి అందాలను ఎక్స్‌ప్లోర్ చేయాలని చాలా మంది ఇండియన్స్‌ కలలు కంటారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కలలు నెరవేరవు. అయితే, నేచర్ వండర్స్‌ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలోనే మంత్రముగ్ధులను చేసే అనేక టూరిస్ట్ డెస్టినేషన్స్‌ ఉన్నాయి, అవి పర్యాటకులను తమ అందంతో ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో దాకీ సరస్సు (Dawki Lake) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

మేఘాలయ (Meghalaya)లోని ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ సరస్సు, సహజ సౌందర్యంతో సందర్శకులను కట్టి పడేస్తోంది. ఈ లేక్ మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నీటి వనరుగానూ పేరు తెచ్చుకుంది. ఉమ్‌గోట్ నది (Umngot River) అని కూడా పిలిచే దాకీ సరస్సు, మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకు ఈ సమ్మర్ బెస్ట్ జీన్. ఎందుకంటే వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

దాకీ సరస్సు స్పష్టమైన నీటితో మనసులు దోచేస్తుంది. దీని చుట్టూ ఉన్న పచ్చని కొండలు మరింత ఆకట్టుకుంటాయి. సరస్సు ఒడ్డున వరుసగా నాటిన వెదురు చెట్లు, రంగురంగుల పువ్వులు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చాయి. దాకీ సరస్సుకు సమీపంలో ఉన్న మావ్లిన్నోంగ్ (Mawlynnong) గ్రామం 2003లో ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం (Asia’s Cleanest village)గా ఎంపికైంది. పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ కలిగిన మావ్లిన్నోంగ్ ఊరి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని (Plastic use) నిషేధించారు. వారి కారణంగానే ఈ రివర్ క్లీనెస్ట్ లేక్‌గా నిలిచింది.

* ఎలా చేరుకోవాలి?

ఈ సరస్సు భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంది. షిల్లాంగ్ నుంచి 80 కిలోమీటర్ల ట్యాక్సీ ప్రయాణం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సులో బోటింగ్ కూడా చేయవచ్చు. ఒడ్డున వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు, పర్వతాల అందాలను ఆస్వాదించవచ్చు. సరస్సు ఒడ్డున నిర్మించిన చిన్న రెస్టారెంట్లలో కూర్చుని లోకల్ ఫుడ్స్‌ రుచి చూడవచ్చు. చేపలు పట్టడం, ఈత కొట్టడం వంటి అనేక వాటర్ యాక్టివిటీస్‌ ఎంజాయ్ చేయవచ్చు.

* జల్ శక్తి శాఖ ప్రశంసలు

2021లో, జల్ శక్తి శాఖ ట్విట్టర్ ద్వారా ఈ నది దేశంలోనే అత్యంత శుభ్రమైనదని ప్రకటించింది. “ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన నదులలో ఒకటి భారతదేశంలోనే ఉంది. అదే మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్‌గోట్ నది. ఈ సరస్సు నీరు చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండటం వల్ల పడవ గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. మన దేశంలోని అన్ని నదులు కూడా ఇంతే శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేఘాలయ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్!” అని జల్ శక్తి మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. దాకీ సరస్సు భారతదేశంలోని ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, దీనిని ప్రతి ఒక్కరూ ఒకసారి అయినా సందర్శించాలి.

Advertisment
తాజా కథనాలు