Amit Shah: హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియోకు సంబంధించి కేసులో శ్రీ రీతోమ్ సింగ్ అనే వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం, కాంగ్రెస్ నేతలు షేర్ చేస్తున్నారంటూ ఎంహెచ్‌ఏ, బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నేతలు షేర్ చేశారంటూ..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన నకిలీ వీడియోకు సంబంధించి అసోం పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం (ఏప్రిల్ 29) తెలిపారు. ఆ వ్యక్తిని రీతోమ్ సింగ్‌గా గుర్తించారు. అమిత్ షా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోను కాంగ్రెస్ నేతలు షేర్ చేశారంటూ హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ నమోదు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ సెక్షన్లు, ఐటీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు..
ఇదిలావుంటే.. ఈ విషయంలోనే తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు(Delhi Police) సమన్లు జారీ చేశారు. అమిత్ షా(Amit Shah) ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని తెలిపారు.రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్(Congress) నేతలకు సమన్లు ఇచ్చారు. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరు గాంధీ భవన్‌కు చేరుకుని అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటూ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటూ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్‌కు సీఆర్పీ 81 కింద నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు.
కేంద్ర హోంశాఖ ఆదేశాలు..
రిజర్వేషన్లు రద్దు మీద అమిత్ షా మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్న వీడియోను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై వేగంగా విచారణ చేయాలని పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ క్రియెట్ చేసిందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణలో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో అమిత్ షా మాట్లాడిన మాటలే మార్ఫింగ్ చేయడం… ఈ మధ్య కాలంలో రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా బీజేపీ మీద ఆరోపణలు చేస్తుండడమే వారి అనుమానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పాటూ మార్ఫింగ్ వీడియో మీద ప్రధాని మోదీ కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయే వారే ఇలాంటి పనులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో పాటూ ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.