TSPSC Notification for Chairman: ఇటీవల టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో టీఎస్పీఎస్సీ బోర్టులో కొత్త ఛైర్మన్‌తో సహా సభ్యులు రానున్నారు.
అయితే ఇటీవల గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ కావడం, పరీక్షలు వాయిదా పడటం లాంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి (Janardhana Reddy) నిర్లక్ష్యంగా ప్రవర్తించారని, ఆయన్ని తొలగించి టీఎస్పీఎస్సీ బోర్డును (TSPSC Board) ప్రక్షాళన చేయాలని అటు రాజకీయ పార్టీల నేతలు.. ఇటు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనుకున్నారు.
Also read: మా రాష్ట్రం పేరును అలా మార్చండి.. సీఎం మమతా బెనర్జీ డిమాండ్..
కానీ ఆయన రాజీనామాను అప్పటి బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన తప్పులు సరిదిద్దాలని.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో జనార్ధన్ రెడ్డి తన రాజీనామాను విరమించుకున్నారు. అయితే ఒకసారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ (Paper Leakage) కాగా రెండోసారి కూడా ఈ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంతో.. కమిషన్‌పై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని హామీలు ఇచ్చాయి.
ఇక చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సర్కార్ TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరికొన్ని రోజుల్లో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది.
Also Read: అయోధ్య క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు…ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!!