రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అవిశ్వాస రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితమే నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడంతో బీఆర్ఎస్ (BRS) నుంచి ఎన్నికైన ఛైర్మన్ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఛైర్మన్ గా ఎన్నిక కానున్నారు. సూర్యాపేటలోను నిన్న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్ కు కౌన్సిలర్లు నోటీసు అందించారు. తాజాగా వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్
ఇప్పటికే వారంతా సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. అయితే.. మేయర్ గుండు సధారాణి కూడా కాంగ్రెస్ (Congress) వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అవిశ్వాస గండం నుంచి గట్టెక్కేందుకు ఇదొక్కటే మార్గమని సుధారాణి భావిస్తున్నట్లు వరంగల్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ మేరకు మంత్రి సీతక్కతో గుండు సుధారాణి సమావేశమైనట్లు సమాచారం. పలువురు కాంగ్రెస్ నేతలను కూడా ఇప్పటికే సుధారాణి కలుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BRS: ‘బీఆర్ఎస్’ను ‘టీఆర్ఎస్’గా మార్చండి.. అధిష్టానానికి వినతులు
అయితే.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండా సురేఖతో (Konda Surekha) పాటు ఆమె భర్త కొండా మురళి నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారనుంది. వారు ఒప్పుకోకపోతే వరంగల్ కు కొత్త మేయర్ రావడం ఖాయమని ఓరుగల్లు రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గుండు సుధారాణి మొదట టీడీపీలో ఉన్నారు. అక్కడి నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గులాబీ గూటికి చేరుకున్నారు. తర్వాత ఆమె ఆ పార్టీ నుంచే కార్పొరేటర్ గా ఎన్నికై మేయర్ పదవిని చేపట్టారు. అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.