మేఘా కృష్ణారెడ్డికి భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) బిగ్ షాకిచ్చింది. కేరళలోని NH-17లో చెంగాల నుంచి నీలేశ్వరం వరకు జరిగిన ఆరు లేన్ల రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు నిర్మాణాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఒప్పందంలో భాగంగా ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) నిబంధనలు పాటించడంలో మోఘా కంపెనీ విఫలమైందని.. ప్రాజెక్టు పనుల్లో అనేక లోపాలు బయటపడ్డాయని చురకలంటించింది. ఈ నేపథ్యంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ప్రాజెక్టు డిజైన్, పనుల్లో లోపాలు
2022లో అక్టోబర్ 29న Km.72+297 (LHS) వద్ద వెహిక్యులర్ అండర్‌పాస్ (VUP)కి చెందిన డెక్ స్లాబ్ కూలిపోయిందని NHAI తెలిపింది. దీనికి సంబంధించి విచారణ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారని.. ఈ ప్రాజెక్టు డిజైన్‌లో, పనుల్లో తీవ్రమైన లోపాలు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తెలినట్లు పేర్కొంది. దీంతో అధికారులు.. ప్రాజెక్టు ఇంచార్జీ, బ్రిడ్జి/స్ట్రక్చరల్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేశారని.. ఆ తర్వాత సిబ్బందిని కూడా నిఘా జాబితాలో చేర్చారినట్లు చెప్పింది. అలాగే గుత్తేదారుడికి రూ.30 లక్షలు, ఇండిపెండెంట్ ఇంజినీర్‌కు రూ.5 లక్షల ఫైన్ విధించినట్లు స్పష్టం చేసింది.
నిర్లక్ష్యం వల్ల మరో ప్రమాదం
ఆ తర్వాత గుత్తేదారుడు సొంత ఖర్చులతో పనులను మళ్లీ ప్రారంభించాలని అధికారులు ఆదేశించినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఒప్పందంలో ఉన్న నిబంధనలు, IRC & MORTH జారీ చేసిన గైడ్‌లైన్స్ పాటించాలని గుత్తేదారుడికి సూచించినట్లు చెప్పింది. అయినప్పటికీ కంపెనీ యాజమాన్యం దీనిపై నిర్లక్ష్యం వహించిందని.. దీంతో 2024లో మే 8 న.. km 78+971 వద్ద ఉన్న 20 మీటర్ల వంతెనపై డెక్ స్లాబ్‌తో పాటు గిర్డర్స్ జారిపడి మరో ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. దీనిపై మీడియాలో కూడా వార్తలు వచ్చాయని.. దీంతో ప్రజలు NHAI కి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం చేసినట్లు అసహనం వ్యక్తం చేసింది. ఇది NHAI ప్రతిష్ఠను దిగజార్చిందంటూ మండిపడింది.
15 రోజుల్లో వివరణ ఇవ్వండి
గుత్తేదారుడి HQ టీమ్/ డిజైన్ టీమ్.. తమ లోపాలను సవరించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డిజైన్‌లో, పనుల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రెండు ప్రమాదాలు జరిగినట్లు స్పష్టమైందని తేల్చి చెప్పింది. NHAI పాలసీలోని 1,3(ii) నిబంధన ప్రకారం మేఘా కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఏడాది పాటు బహిష్కరణ వేటు వేయకుండా.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించకుండా ఎందుకు ఉండాలో వివరించాలని తెలిపింది. ఈ నోటీసుకు సంబంధించి 15 రోజుల్లోనే మీరు అధికారులకు వివరణ ఇవ్వాలని.. లేకపోతే అధికారులే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని NHAI హెచ్చరించింది.