Flight: న్యూజిలాండ్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది. విమానం ప్రయాణీకులతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షిని ఢీకొట్టింది. ఆ తరువాత విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని సురక్షితంగా న్యూజిలాండ్‌లోని విమానాశ్రయంలో దించారు. విమానంలో మొత్తం 73 మంది ప్రయాణికులు ఉన్నారు.
అగ్నిప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు బయలుదేరిన వర్జిన్ ఆస్ట్రేలియా బోయింగ్ 737-800 విమానం మంటల కారణంగా దారి మళ్లించిన తర్వాత న్యూజిలాండ్‌లోని ఇన్వర్‌కార్గిల్ నగరంలోని విమానాశ్రయంలో దిగింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు.
క్వీన్స్‌టౌన్ నుండి విమానం టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత ప్రమాదం జరిగిందని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ న్యూజిలాండ్ షిఫ్ట్ సూపర్‌వైజర్ లిన్ క్రాసన్ తెలిపారు. విమానం ఇన్‌వర్‌కార్గిల్‌కు చేరుకున్నప్పుడు, అగ్నిమాపక దళ సిబ్బంది అప్పటికే అక్కడికి చేరుకున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం సిబ్బంది మంటలను ఆర్పారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని క్వీన్స్‌టౌన్ ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి కేథరీన్ వివరించారు.
Also read: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ…భారత సంతతి మహిళ మృతి!