/rtv/media/media_files/2026/02/12/empty-glass-bottles-2026-02-12-07-55-25.jpg)
దేశ సరిహద్దు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది తుపాకులు, సైనికులు, ముళ్ల కంచె. అయితే బాగా గమనిస్తే ఈ కంచెకు అక్కడక్కడ ఖాళీ గాజు సీసాలు వేలాడుతూ కనిపిస్తాయి. చూడటానికి ఇది వింతగా అనిపించినా, శత్రువుల చొరబాటును అడ్డుకోవడంలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఉపయోగిస్తున్న అత్యంత ప్రభావవంతమైన 'లో-టెక్' భద్రతా వ్యూహాలలో ఇది ఒకటి.
శబ్దమే సైనికులకు సైరన్
సరిహద్దుల్లో ఎల్లప్పుడూ వాతావరణం సైనికులకు అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో శీతాకాలంలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. కంటికి ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించని అటువంటి టైంలో అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు కూడా కొన్నిసార్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ గాజు సీసాలే సైనికులకు 'అలారం'లా పనిచేస్తాయి. ఎవరైనా చొరబాటుదారులు కంచెను కత్తిరించడానికి లేదా దాటడానికి ప్రయత్నిస్తే, ఆ కదలికలకు కంచెకు ఉన్న సీసాలు ఒకదానికొకటి తగిలి "కిణ కిణ"మని శబ్దం చేస్తాయి. ఈ శబ్దం విన్న వెంటనే అప్రమత్తమయ్యే జవాన్లు క్షణాల్లో చర్యలు చేపడతారు.
ఖర్చు తక్కువ - ఫలితం ఎక్కువ
నిరంతర నిఘా: ఈ సీసాలకు విద్యుత్ లేదా బ్యాటరీల అవసరం లేదు. గాలికి ఊగకుండా, కేవలం ఎవరైనా తాకితేనే శబ్దం వచ్చేలా వీటిని అమర్చుతారు.
కాంతి పరావర్తనం: రాత్రివేళ సైనికులు టార్చ్ లైట్ వేసినప్పుడు, ఈ గాజు సీసాలు కాంతిని రిఫ్లెక్షన్ చెందిస్తాయి. దీనివల్ల కంచెలో ఏవైనా మార్పులు జరిగినా లేదా ఎవరైనా అక్కడ నక్కి ఉన్నా సులభంగా గుర్తించవచ్చు.
మానసిక భయం: చిన్న శబ్దం వచ్చినా తాము దొరికిపోతామనే భయం చొరబాటుదారులను సరిహద్దు దాటకుండా అడ్డుకుంటుంది.
నేటి ఆధునిక కాలంలో లేజర్ గోడలు, థర్మల్ ఇమేజింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, మన జవాన్లు ఇప్పటికీ ఈ సంప్రదాయ పద్ధతిని నమ్ముతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ ఫెయిల్ అవ్వొచ్చు కానీ, ఈ 'లో-టెక్' సీసాల మోత ఎప్పుడూ మోసపోనివ్వదని వారి నమ్మకం.
Follow Us