ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో గత కొన్ని నెలలుగా అక్కడి ప్రజలను తోడేళ్లు వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తోడేళ్లను కనిపిస్తే చంపేయాలని యూపీ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎట్టకేలకు ఆపరేషన్ భేడియా సక్సెస్ అయ్యింది. మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో.. ఇప్పటివరకు ఐదు తోడేళ్లు పట్టబడ్డాయి. శనివారం ఆరో తోడేలును కూడా గ్రామస్థులు మట్టుబెట్టారు. ఆ తోడేలు మేకను వెంటాడుతుండగా గ్రామస్థులు గమనించారు. వెంటనే తోడేలును వెంబండించి కొట్టి చంపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Also read: దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం
ఇప్పటిదాకా ఐదు తోడేళ్లు పట్టుబడగా.. గత 24 రోజులుగా ఆరో తోడేలు మాత్రం కనిపించకుండా తిరుగుతోంది. దీంతో అధికారులకు దాన్ని పట్టుకోవడం సవాలుగా మారింది. ఎట్టకేలకు ఆ ఆరో తోడేలు ఇప్పడు గ్రామస్థుల చేతిలో హతమైంది. అయితే ఆ తోడేలు మ్యాన్‌ఈటర్ అని చెప్పలేమని అటవీ అధికారులు చెబుతున్నారు. గత కొన్ని నెలల నుంచి బహ్రెయిచ్ జిల్లాలో ఆరు తోడేళ్ల గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో.. 9 మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. తోడేళ్ల దాడులతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. చివరికి ఆరు తోడేళ్ల పని అయిపోవండతో ఆపరేషన్ భేడియా విజయవంతమయ్యింది. దీనిపై బహ్రయిచ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.