/rtv/media/media_files/2026/02/17/bp-2026-02-17-13-04-55.jpg)
బీపీ పేషెంట్లు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది రోజూ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు. ఒక్క రోజు మర్చిపోయినా బీపీ పెరిగిపోతుందన్న భయం. అయితే, భవిష్యత్తులో ఈ పరిస్థితి మారబోతోంది. కేవలం ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్ చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. ఈ ఇంజెక్షనతో మరోక ఉపయోగం కూడా ఉంది.
అదేంటంటే.. ప్రస్తుతం వాడుకలో ఉన్న మందులు రక్తపోటు పెరిగిన తర్వాత దానిని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. కానీ, ఈ కొత్త ఇంజెక్షన్ ఏకంగా బీపీ పెరగడానికి కారణమయ్యే మూలాల మీద దెబ్బకొడుతుంది. ఇది siRNA అనే అత్యాధునిక టెక్నాలాజీతో పనిచేస్తుంది. మన లివర్ ఉత్పత్తి చేసే యాంజియోటెన్సినోజెన్ అనే ప్రోటీన్ బీపీ పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఇంజెక్షన్ కాలేయంలో ఆ ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే దాదాపు ఆరు నెలల పాటు రక్తపోటు అదుపులో ఉంటుందని క్లినికల్ ట్రయల్స్ (ఫేజ్ 3) లో తేలింది.
ఈ మార్పును వైద్య నిపుణులు స్వాగతిస్తున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. చాలామంది రోగులు ప్రతిరోజూ మందులు వేసుకోవడం మర్చిపోతుంటారు. ఇలాంటి వారికి ఈ ఇంజెక్షన్ ఒక వరం లాంటిదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ ధర అందరికీ అందుబాటులో ఉంటుందా? అనేది అసలైన ప్రశ్న. అలాగే ఆరు నెలల పాటు పనిచేసే మందు వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, ఆ ప్రభావాన్ని మధ్యలో ఆపడం కష్టమని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హై బీపీతో 140 కోట్ల మంది
ఇక సుమారు 140 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారు. వీరిలో కేవలం 25 శాతం మందికి మాత్రమే బీపీ అదుపులో ఉంది. ఐసీఎంఆర్ (ICMR) నివేదిక ప్రకారం భారత్‌లో 31 కోట్ల మందికి పైగా బీపీ సమస్యతో బాధపడతున్నారు. అంటే దేశ జనాభాలో మూడో వంతు మందికి ఈ సమస్య ఉందన్నమాట. ప్రస్తుతం ఈ మందులు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ముప్పులను గణనీయంగా తగ్గించవచ్చు. అయితే, సామాన్యులకు ఇది ఎంతవరకు అందుబాటులో ఉంటుందనేది వేచి చూడాలి.
Follow Us