తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ వీడియో కాల్

కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలకు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఈ విషాద ఘటన జరిగిన దాదాపు పది రోజుల తర్వాత, మంగళవారం ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి, వారిని ఓదార్చారు.

New Update
tvk vijay

tvk vijay

తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలకు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఈ విషాద ఘటన జరిగిన దాదాపు పది రోజుల తర్వాత, మంగళవారం ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి, వారిని ఓదార్చారు. సెప్టెంబర్ 27న కరూర్ వేలుచామిపురంలో విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న సంగతి  తెలిసిందే. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట జరిగి, 41 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ప్రారంభంలో, మరో ఉద్రిక్త పరిస్థితిని నివారించేందుకు తాను వెంటనే కరూర్‌కు రాలేకపోతున్నానని విజయ్ ఒక వీడియో మెస్సేజ్ విడుదల చేశారు. అయితే, మంగళవారం టీవీకే పార్టీ నేతలు బాధితుల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి, విజయ్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. తొక్కిసలాటలో భార్య ప్రియదర్శిని(35), కుమార్తె ధరణిక (14)లను కోల్పోయిన ఈమూర్ పుడూర్‌కు చెందిన కె. శక్తివేల్ కుటుంబంతో విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ నష్టం పూడ్చలేనిది. ఇది జరగాల్సింది కాదు. జరిగిన దానికి నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటాను" అని భరోసా ఇచ్చినట్లు శక్తివేల్ తెలిపారు. త్వరలోనే తాను వ్యక్తిగతంగా కరూర్‌కు వచ్చి బాధితుల కుటుంబాలను కలుస్తానని విజయ్ వారికి హామీ ఇచ్చారు.

ఈ వీడియో కాల్ సంభాషణను రికార్డు చేయవద్దని టీవీకే కార్యకర్తలు కుటుంబ సభ్యులను కోరారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు టీవీకే నేతలపై కేసులు నమోదు చేయగా, పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ తొక్కిసలాటపై సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు