పహల్గామ్‌ ఉగ్రదాడిలో చైనా కెమెరాలు.. NIA దర్యాప్తులో షాకింగ్ విషయాలు

పహల్గామ్‌ ఉగ్రదాడి దర్యాప్తులో NIA పురోగతి సాధించింది. ఈ దాడిలో ఉగ్రవాదులు లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. టెర్రరిస్టులు తమ దాడులు రికార్డ్ చేసేందుకు, ప్లాన్ చేసేందుకు ‘గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరా’లను వాడినట్లు NIA గుర్తించింది.

New Update
Chinese cameras

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏడాది జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక పురోగతి సాధించింది. ఈ దాడిలో ఉగ్రవాదులు లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. టెర్రరిస్టులు తమ దాడులను రికార్డ్ చేసేందుకు, స్కెచ్ గీయడం కోసం ‘గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరా’లను వాడినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న ఈ కెమెరాల మూలాలను వెతుకుతూ వెళ్లిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ కెమెరాలు చైనాకు చెందిన ‘ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ అనే సంస్థ వద్ద ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. 2024 జనవరి 30న చైనాలోని డోంగ్వాన్‌లో ఈ కెమెరాలు మొదటిసారి యాక్టివేట్ అయినట్లు ఎన్‌ఐఏ సాంకేతిక విశ్లేషణలో వెల్లడైంది. కెమెరా తయారీ సంస్థ ‘గో ప్రోబీవీ’ని ఎన్‌ఐఏ సంప్రదించగా, ఆ కెమెరాల సేల్స్ సంబంధించి తమ వద్ద ఎటువంటి అధికారిక రికార్డులు లేవని వారు సమాధానమిచ్చారు. అంటే, ఇవి అనధికారిక మార్గాల్లో లేదా స్మగ్లింగ్ ద్వారా ఉగ్రవాదుల చేతుల్లోకి చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ కెమెరాలను ఎవరు కొనుగోలు చేశారు? చైనా నుంచి ఇవి ఉగ్రవాదుల చేతికి ఎలా చేరాయి? అనే విషయాలను నిగ్గుతేల్చడానికి చైనా ప్రభుత్వం అధికారిక సహకారం తీసుకోవాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. చైనా న్యాయశాఖకు లేఖ రాసేందుకు జమ్ముకశ్మీర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం నుంచి ఎన్‌ఐఏకు అనుమతి లభించింది. ఈ అంతర్జాతీయ దర్యాప్తు ప్రక్రియకు భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

దర్యాప్తులో ఈ కెమెరాలు ఎందుకు ముఖ్యం?
గత ఏడాది ఏప్రిల్ 18న పహల్గామ్‌లో జరిగిన ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఉగ్రవాదులు ఈ గో ప్రో కెమెరాలను తమ తలలకు లేదా శరీరానికి తగిలించుకుని దాడిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ కెమెరాల్లోని డేటాను పూర్తిగా రికవరీ చేయగలిగితే.. దాడికి ముందు ఉగ్రవాదులు ఎక్కడెక్కడ తిరిగారు? వారికి స్థానికంగా ఎవరైనా సహకరించారా? పాకిస్థాన్ సరిహద్దుల నుంచి వారు ఎలా చొరబడ్డారు? అనే కీలక సాక్ష్యాలు లభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం చైనా నుంచి రాబోయే సమాచారం ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో చైనా వస్తువుల వినియోగం పెరగడం భద్రతా దళాలను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisment
తాజా కథనాలు