Waqf Board Act: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. వక్ఫ్ బోర్డు చట్టంలో వీటిపై స్టే!

వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వక్ఫ్ చట్టం మొత్తం చెల్లుబాటును నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ, చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే విధించింది. ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి రికార్డుల విషయంలో కీలక పరిణామం.

New Update
Waqf Amendment Bill

Waqf Amendment Bill

వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వక్ఫ్ చట్టం మొత్తం చెల్లుబాటును నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ, చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే విధించింది. ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి రికార్డుల విషయంలో కీలక పరిణామం. ఈ కేసు విచారణలో, 2025లో చేసిన వక్ఫ్ చట్ట సవరణల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ చట్టం మొత్తం అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, కొత్తగా చేర్చిన కొన్ని నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాటిపై లోతైన విచారణ అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో, కొన్ని నిర్దిష్ట నిబంధనలపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని కోర్టు నిలిపివేసింది.

వక్ఫ్ బై యూజర్:

దీర్ఘకాలంగా వక్ఫ్ కోసం ఉపయోగించిన ఆస్తులను, వాటిని వక్ఫ్‌గా ప్రకటించే నిబంధనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆస్తులను డీనోటిఫై చేయవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. దీని వల్ల చాలా వివాదాలు తలెత్తుతాయని, ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన విధానం తీసుకురావాలని సూచించింది.

నాన్-ముస్లిం సభ్యుల నియామకం:

వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను నియమించే నిబంధనపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇతర మతాల బోర్డులలో ముస్లింలను నియమించడం సాధ్యమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, వక్ఫ్ బోర్డులు లేదా కౌన్సిల్స్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని ఆదేశించింది.

ఆస్తుల గుర్తింపు అధికారం:

ఆస్తులు వక్ఫ్ కాదా అని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు ఇవ్వడంపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కలెక్టర్ న్యాయమూర్తి పాత్ర పోషించడం సరికాదని పేర్కొంది.

పిటిషనర్లు వక్ఫ్ చట్టం మొత్తం రాజ్యాంగ విరుద్ధమని వాదించగా, కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినవని వాదించింది. అయితే, సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనలతో పాక్షికంగా ఏకీభవిస్తూ, చట్టంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ తాజా తీర్పుతో, వక్ఫ్ ఆస్తుల వివాదాలు, నిర్వహణ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ కేసుపై పూర్తి విచారణ జరిగి తుది తీర్పు వచ్చే వరకు ఈ వివాదాస్పద నిబంధనల అమలు నిలిచి ఉంటుంది. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతుంది.

Advertisment
తాజా కథనాలు