/rtv/media/media_files/2026/02/01/nir-2026-02-01-11-34-11.jpg)
పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినాన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ.. 'వికసిత్ భారత్' లక్ష్యంగా భారీ కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్‌లో టెక్నాలజీ, ఆరోగ్యం,పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేశారు..
దేశాన్ని గ్లోబల్ చిప్ హబ్‌గా మార్చే లక్ష్యంతో సెమీకండక్టర్ మిషన్ రెండో దశను ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా రూ. 40,000 కోట్లు కేటాయించారు. ఇది ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఫార్మా రంగంలో పరిశోధనలు, తయారీని ప్రోత్సహించేందుకు రూ. 10 వేల కోట్లతో కొత్త పథకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. దేశంలో కొత్తగా మూడు బయోఫార్మా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు, ఇప్పటికే ఉన్న 7 సంస్థలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
ఏపీకి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కీలకమైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక పథకాన్ని మంత్రి ప్రకటించారు. అలాగే, దేశవ్యాప్తంగా మూడు కొత్త రసాయన పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. జౌళి రంగం ఆధునీకీకరణ ద్వారా భారీగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ బడ్జెట్‌ను మూడు ప్రధాన కర్తవ్యాల ఆధారంగా రూపొందించినట్లు మంత్రి వివరించారు:
1. సమ్మిళిత ఆర్థిక వృద్ధి: అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం.
2. వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం: సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం.
3. సబ్ కా సాత్ - సబ్ కా వికాస్: సంస్కరణలతో కూడిన సమగ్ర అభివృద్ధి.
తమ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ సాధించిందని, జనవరి నెలలో రూ.1.93 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రావడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, దేశం ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుంటూ స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
Follow Us